వేర్వేరు మతాలకు చెందిన జంట వివాహం చేసుకున్న సందర్భంలో వారికి పుట్టే పిల్లలకు తండ్రి నుంచి వచ్చే భరణం వర్తిస్తుందని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయంలో మతం కానీ, కులం కానీ ఎలాంటి ప్రామాణికం కాదని తేల్చి చెప్పింది. కేరళ హైకోర్టులోని జస్టిస్ ముస్తాఖ్, జస్టిస్ డాక్టర్ ఎ.కౌసర్ ఎడప్పగత్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం (జనవరి 17) ఈ తీర్పు వెలువరించింది. 
ఈ కేసులో పిటిషనర్ హిందూ. ఇతని భార్య ముస్లిం. 


కోజికోడ్‌కు చెందిన జేడబ్ల్యూ అరగథన్ అనే వ్యక్తి పిటిషన్ విషయంలో కేరళ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇతని విషయంలో గతంలో కేరళలోని నేదుమంగడ్ ఫ్యామిలీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తన కుమార్తెకు (ముస్లిం భార్య కుమార్తె) రూ.14.67 లక్షలు పెళ్లి ఖర్చులు ఇవ్వాలని.. రూ.96 వేలు చదువు కోసం, మరో రూ.లక్ష భరణం రూపంలో ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. అయితే, ఈ ఫ్యామిలీ కోర్టు తీర్పు సరికాదని సవాలు చేస్తూ పిటిషనర్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.


వేర్వేరు మతాలకు చెందిన భార్యాభర్తలకు జన్మించిన పెళ్లి కాని కుమార్తె.. ఆమె పెళ్లికి అయ్యే ఖర్చును తండ్రి నుంచే పొందాలి. అయితే, ఎంత మొత్తం పెళ్లి ఖర్చుల రూపంలో ఇవ్వాలనే ప్రశ్నకు కూడా కోర్టు సమాధానం చెప్పింది. ‘‘మన సమాజంలో పెళ్లి అనేది ఒక వేడుక కానేకాదు. వివాహాలు నిరాడంబరంగా జరుపుకొనే రోజులు పోయాయి. పెళ్లి అనే పవిత్ర సందర్భాన్ని ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడానికి ఒక అవకాశంగా పరిగణిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, వేడుకలు లేదా వర్చువల్ వెడ్డింగ్ లేకుండా ఆడంబరం లేకుండా వేడుక జరుపుకోవడం సాధ్యమవుతుందని ప్రస్తుత కరోనా మహమ్మారి మనకు నేర్పింది. ప్రజలు తమకు నచ్చిన పద్ధతిలో వివాహాన్ని నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంది. కానీ, పెళ్లికాని కూతురు తన తండ్రిని ఘనంగా తన వివాహం నిర్వహించమని అడగదు’’ అని హై కోర్టు వ్యాఖ్యానించింది.