Indian Railway: మన దేశంలో టికెట్ అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణించగలిగే రైలు ఉందంటే నమ్ముతారా? అవును మన దేశంలోని ఓ రైలులో ఎవరైనా టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. టికెట్ ఎందుకు తీసుకోలేదని అడిగే టీటీఈలు కూడా ఉండరు. ఎవరూ ఫైన్ కూడా వేయరు. ఆ రైలు ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందో చూద్దాం.







భాక్రా నంగల్ రైలు


హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న 13 కి.మీ. రైలు మార్గంలో ఈ ట్రైన్ నడుస్తుంది. ఇది సట్లెజ్ నది గుండా వెళుతుంది. ఈ రైలును భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు నిర్వహిస్తోంది. కొండకోనలు, నదుల సోయగాల మధ్య రైలు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైలులో వెళ్లే ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయరు. అందుకే ప్రతి రోజూ ఎంతో మంది ప్రజలు ఈ రైలులో ప్రయాణిస్తారు. ముఖ్యంగా భాక్రా-నంగల్ ఆనకట్ట అందాలను చూడేందుకే ఎక్కువ మంది వస్తుంటారు.


ఎందుకు?


భాక్రా నంగల్ డ్యామ్ నిర్మాణ పనులు 1948లో మొదలయ్యాయి. కార్మికులు, భారీ యంత్రాలను తీసుకెళ్లేందుకు వీలుగా అప్పుడు రైలు మార్గాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1963లో భాక్రా నంగల్ డ్యామ్‌ను ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా భాక్రా గ్రామంలో ఉంది. ఇది 741 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన డ్యామ్‌లో ఇది ఒకటి.


మొదట డ్యామ్ నిర్మాణానికి అవసరమమ్యే కార్మికులు, సామగ్రిని తరలించేందుకు ఈ రైలును నడిపారు. ఆ తర్వాత అదే మార్గంలో ప్రయాణికుల రైలును ఉచితంగా నడుపుతున్నారు. డ్యామ్‌కు చారిత్రక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఈ రైలు మార్గం కమర్షియల్ చేయలేదు. ఎందుకంటే తర్వాతి తరం వారు ఈ వారసత్వ కట్టడాన్ని చూసేందుకు రావాలని బీబీఎంబీ కోరుకుంటోంది. అందుకే భాక్రా నంగల్‌ రైలును వారసత్వ సంపదగా భావించి ఇక్కడికి వచ్చే పర్యటకులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 


Also Read: Stock Market Crash: గవర్నర్‌ సడెన్‌ షాక్‌ - ఒక్క గంటలో వేల కోట్ల నష్టం! సెన్సెక్స్‌ 1306, నిఫ్టీ 391 డౌన్‌


Also Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ షురూ- మరి దరఖాస్తు చేసుకున్నారా?