Repo Rate Hiked:
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులపై పెను భారం వేసేలా వడ్డీ రేట్లను పెంచింది. ప్రస్తుతం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకపోయినా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. రేట్ల పెంపునకు ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు చెప్పారు.
రెపో రేటను 40 బేసిస్ పాయింట్ల మేర పెంచి 4.4 శాతంగా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోందని, ఫలితంగా వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చిందని వివరించారు. ఆర్‌బీఐ నిర్ణయంతో ఈఎమ్ఐలపై భారం పడనుంది.
2 ఏళ్లు
2020 మే 22న ఆర్‌బీఐ చివరిసారిగా వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఫలితంగా రెపో రేటు చరిత్రలో కనిష్ఠమైన 4 శాతానికి దిగొచ్చింది. ఆ తర్వాత వరుసగా 11 సార్లు ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరిగినా వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచింది. ఇప్పుడు మాత్రం అనూహ్యంగా వడ్డీ రేట్లను పెంచింది.
మార్కెట్ స్మాష్
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1307 పాయింట్లు కుప్పకూలి 55,669కి పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 391 పాయింట్లు పతనమై 16,677వద్ద స్థిరపడింది. వడ్డీ రేట్ల పెంపుతో మదుపర్లంతా చివర్లో అమ్మకాలకే మొగ్గు చూపటం వల్ల మార్కెట్లు భారీగా నష్టపోయాయి.
Also Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ షురూ- మరి దరఖాస్తు చేసుకున్నారా?