Central Govt Deepfake Crackdown: 


ప్రత్యేక అధికారి నియామకం..


డీప్‌ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. పది రోజుల్లోగా ఇలాంటి వీడియోలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. ఈ వీడియోలను ఆటోమెటిక్‌గా గుర్తించే టెక్నాలజీపైనా ఫోకస్ పెట్టాలని సూచించారు. అందుకు అందరు ప్రతినిధులు అంగీకరించారు. ఈ క్రమంలోనే కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరో కీలక ప్రకటన చేశారు. ఇలాంటి కంటెంట్ పెట్టిన వాళ్లపై చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఆఫీసర్‌ని నియమిస్తామని వెల్లడించారు. త్వరలోనే ఓ వెబ్‌సైట్‌ లాంఛ్ చేస్తామని, IT Rulesని ఎవరైనా అతిక్రమించినా...ఇలాంటి కంటెంట్‌ ఎవరి కంటపడినా ఆ సైట్‌లో కంప్లెయింట్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ఆ ఫిర్యాదుల ఆధారంగానే FIR నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అంతే కాదు. ఈ కంటెంట్‌ని ఎవరు క్రియేట్ చేశారు..? ఎవరు పోస్ట్ చేశారు లాంటి వివరాలు ఇస్తే ఆ సంస్థ లేదా వ్యక్తులపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతమున్న చట్టాలు డీప్‌ఫేక్‌ సమస్యని సమర్థంగా ఎదుర్కొంటాయన్న నమ్మకముందని అన్నారు. ఐటీ రూల్స్ ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ నిబంధనల్ని మార్చేయాలి సూచించారు. 


"డీప్‌ఫేక్ వీడియోల సమస్యపై దృష్టి పెడుతున్నాం. ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో చర్చలు జరిగాయి. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. డీప్‌ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఓ ఆఫీసర్‌ని నియమించనున్నాం. ఇంటర్నెట్‌లో నిషేధం విధించిన కంటెంట్‌ని పోస్ట్‌ చేస్తే కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. ఆ అధికారి అన్ని ప్లాట్‌ఫామ్స్‌తోనూ సంప్రదింపులు జరిపి అలాంటి కంటెంట్‌ని గుర్తిస్తారు. ఈ అధికారి ద్వారానే డీప్‌ఫేక్ వీడియోలకు సంబంధించిన ఫిర్యాదులన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వస్తాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ ఫిర్యాదులను స్వీకరించి అందుకు తగ్గట్టుగా స్పందిస్తారు"


- రాజీవ్ చంద్రశేఖర్, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి


 






డీప్‌ఫేక్ వీడియోలను షేర్ చేసిన వాళ్లపై చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రూ.లక్ష జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే ఈ AI టూల్‌పై అసహనం వ్యక్తం చేశారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. అందరూ బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.


Also Read: What is 'Moye Moye': సోషల్ మీడియాని ఊపేస్తున్న మోయె మోయె సాంగ్, ఈ పాటలో అంత అర్థముందా?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply