G7 Summit: అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, కెనడాలతో కూడిన జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. భారతీయుల కళా నైపుణ్యాన్ని వారికి చాటిచెప్పారు. జీ7 దేశాధినేతలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా తయారు చేసిన వస్తువులను బహుమతిగా ఇచ్చారు.


ఉత్తర్‌ప్రదేశ్‌లో అమలు చేస్తోన్న 'ఒక జిల్లా-ఒక ఉత్పత్తి' పథకంలో ఈ బహుమతులను తయారు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కళాకారుల పనితనానికి గుర్తింపు లభించే విధంగా ఈ బహుమతులను తీర్చిదిద్దారు. 


బైడెన్‌కు


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు గులాబీ మీనాకరి బ్రోచ్‌ను ప్రధాని మోదీ బహూకరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో దీనిని స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. దీని మీద అత్యంత ఆకర్షణీయమైన నగిషీ చెక్కారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ కోసం రూపొందించిన బ్రోచ్‌కు మ్యాచ్ అయ్యే విధంగా జో బైడెన్ కఫ్‌లింక్స్‌ను తయారు చేశారు.


బోరిస్‌కు


బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ప్లాటినం పెయింటెడ్ కళాకృతి టీ-సెట్‌ను మోదీ బహుమతిగా ఇచ్చారు. దీనిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తయారు చేశారు. క్వీన్ ఎలిజబెత్ ప్లాటినం జూబిలీ ఉత్సవాలను గుర్తు చేస్తూ, ఆమె గౌరవార్థం ఈ టీ-సెట్‌కు ప్లాటినం పెయింట్ వేశారు.  


మేక్రాన్‌కు


ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌కు క్యారియర్ బాక్స్‌, ఖాదీ పట్టు వస్త్రంపై చేతితో ఎంబ్రాయిడరీ చేసిన జరీ జర్దోసీ బాక్స్‌ను, ఫ్రెంచ్ జాతీయ జెండాలో ఉండే మూడు రంగులతో శాటిన్ టిష్యూను బహుమతిగా ఇచ్చారు. దీనిని లఖ్‌నవూలో తయారుచేశారు. 


ఓలఫ్‌కు 


జర్మన్ ఛాన్సలర్ ఓలఫ్ షోల్జ్‌కు నికెల్ కోటింగ్‌తో కూడిన కంచు బిందెలను బహూకరించారు. 


ఫుమియోకు






జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదకు మట్టితో తయారు చేసిన పాత్రలను బహూకరించారు. వీటిని నల్ల మట్టితో తయారు చేశారు. నల్ల రంగును ప్రకాశవంతంగా తీర్చిదిద్దారు.


ట్రుడోకు






కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు కశ్మీరులో తయారైన పట్టు తివాచీని బహూకరించారు. ఇది చేతితో అల్లిన తివాచీ.


మారియోకు


ఇటలీ ప్రధాని మంత్రి మారియో డ్రఘికి మార్బుల్ ఇన్‌లే టేబుల్ టాప్‌ను బహూకరించారు.


రమఫోసాకు






దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసా‌కు డోక్రా ఆర్ట్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిని రామాయణం ఇతివృత్తంతో ఛత్తీస్‌గఢ్‌లో తయారు చేశారు.


Also Read: Heat Wave In Tokyo: జపాన్‌లో భానుడి బ్యాటింగ్‌- 150 ఏళ్ల రికార్డ్ బద్దలు!



Also Read: Joe Biden Greets PM Modi: మోదీ భూజం తట్టి ఆప్యాయంగా పిలిచిన బైడెన్- వైరల్ వీడియో చూశారా?