Delhi Air Pollution: 


పది రోజుల వింటర్ బ్రేక్..


ఢిల్లీలో కాలుష్యం కారణంగా (Delhi Pollution) స్కూల్స్‌ ఇప్పటికే బంద్ అయ్యాయి. ఆన్‌లైన్‌లోనే క్లాస్‌లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే..ఇప్పట్లో పరిస్థితులు చక్కబడే అవకాశాలు కనబడడం లేదు. అందుకే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని స్కూల్స్‌కి వింటర్ బ్రేక్ (Winter Break in Delhi) ప్రకటించింది. నవంబర్ 9-18 వరకూ స్కూల్స్‌ని మూసివేయనుంది. దాదాపు ఆరు రోజులుగా కాలుష్య స్థాయి ఏ మాత్రం తగ్గకపోగా పెరుగుతూ వస్తోంది. మరి కొద్ది రోజుల పాటు కూడా కాలుష్య స్థాయిలో తగ్గదని చెబుతున్నారు అధికారులు. అందుకే వింటర్ బ్రేక్‌ కింద సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌ (Gopal Rai), విద్యాశాఖ మంత్రి అతిశి, రవాణా మంత్రి కైలాశ్ గహ్లోట్‌తో పాటు మరి కొందరు కీలక అధికారులు సమావేశమయ్యారు. ఈ  భేటీ తరవాతే సెలవులు ప్రకటించారు. సాధారణంగా ఢిల్లీలో వింటర్ బ్రేక్ డిసెంబర్-జనవరి మధ్యలో ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటారు. కానీ...ఈ సారి కాలుష్యం కమ్మేయడం వల్ల ముందుగానే సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. 


"కాలుష్య స్థాయి రోజురోజుకీ పెరుగుతోంది. అందుకే నగరంలోని స్కూల్స్‌కి వింటర్ బ్రేక్ ప్రకటించాం. ఈ నెల 9 నుంచి 18 వరకూ వింటర్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. 10,12వ తరగతి విద్యార్థులకు తప్ప మిగతా తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించకూడదని స్కూల్ యాజమాన్యాలకు ఆదేశాలిచ్చాం"


- గోపాల్ రాయ్, పర్యావరణ మంత్రి






పడిపోయిన గాలి నాణ్యత..


ప్రస్తుతం ఢిల్లీని పొగ మంచు కమ్ముకుంది. కాలుష్య స్థాయిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. కాస్త మెరుగైనట్టు కనిపిస్తున్నా మళ్లీ వెంటనే తగ్గిపోతోంది. ముఖ్యంగా NCR పరిసర ప్రాంతాల్లో AQI ప్రమాదకరస్థాయికి చేరుకుంది. నిర్దేశిత కాలుష్యం కన్నా 30-40 రెట్లు ఎక్కువగా నమోదవుతోంది. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు సరిబేసి (Odd Even System) వాహన విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ సుప్రీంకోర్టు దీనిపై రివ్యూ చేయాలని నిర్ణయించుకుంది. అప్పటి వరకూ ఇది అమలు చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది.  ప్రస్తుతానికి ఈ విధానాన్ని పక్కన పెట్టింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఈ సరిబేసి విధానం ఎంత వరకూ ఉపయోగకరంగా ఉంటుందో సుప్రీంకోర్టు రివ్యూ చేసిన తరవాతే తుది నిర్ణయం తీసుకోనుంది. గోపాల్ రాయ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 






Also Read: దేశం పరువు తీశారు, ఇంకా ఎంత దిగజారిపోతారు - నితీశ్ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్