Madhya Pradesh Election 2023:



ప్రధాని మోదీ వ్యాఖ్యలు..


మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో (Madhya Pradesh Elections) ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దమో ప్రాంతంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన...మూడోసారి తాను ప్రధాని అవుతానంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు. మళ్లీ ప్రధాని అయిన తరవాత దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 2014 తరవాత భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తు చేశారు. 


"2014 తరవాత మేం అధికారంలోకి వచ్చాం. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇండియాని 200 ఏళ్ల పాటు పరిపాలించిన బ్రిటన్‌ని కూడా వెనక్కి నెట్టేశాం. నేను మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తరవాత భారత ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే నంబర్ 3 స్థానానికి తీసుకెళ్తాను"


- ప్రధాని నరేంద్ర మోదీ






ప్రతి రంగంలోనూ భారత్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని అన్నారు ప్రధాని మోదీ. చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ ద్వారా వేరే ఏ దేశమూ సాధించని లక్ష్యాన్ని సాధించగలిగామని కొనియాడారు. భారత్ G20 సదస్సుకి నేతృత్వం వహించడాన్నీ ప్రపంచ దేశాలు ప్రశంసించాయని వెల్లడించారు. అటు భారత క్రీడాకారులు కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారని వివరించారు ప్రధాని మోదీ. ఇదే సమయంలో కాంగ్రెస్‌కి గురి పెట్టారు. 85% కమిషన్ పార్టీ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని ఉద్దేశిస్తూ ఆ పార్టీ తమ నేతల్ని రిమోట్‌ కంట్రోల్‌తో కట్టడి చేస్తుందని సెటైర్లు వేశారు. ఆ పార్టీతో ప్రజలకు జాగ్రత్తగా ఉండాలంటూ చురకలు అంటించారు. పేదలకు చెందాల్సిన డబ్బుల్ని దొంగిలిస్తోందని విమర్శించారు. ఐదేళ్ల పాటు ఉచిత రేషన్‌ ఇవ్వడం ఉచిత హామీల కిందకు రాదా అని కాంగ్రెస్‌ ప్రశ్నించడంపైనా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ప్రశ్నలు వేసే కాంగ్రెస్‌కి తాము భయపడాలా అంటూ చురకలు అంటించారు. 






Also Read: 600 కిలోమీటర్లు శవంతోనే ప్రయాణం, రైల్వే ప్యాసింజర్స్‌కి ఊహించని అనుభవం