NRI's Diwali Celebrations: దీపావళి పండుగ సమయంలో, ధన్‌తేరస్‌ రోజున బంగారం కొనడం మన దేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ రోజున కొన్న బంగారం అదృష్టంగా మారుతుందని, సంపద సృష్టిస్తుందని చాలామంది భారతీయులు నమ్ముతారు. ధన్‌తేరస్‌ రోజున కనీసం గ్రాము స్వర్ణాన్నైనా ఇంటికి తీసుకొస్తే, లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుందని భావిస్తారు. కాబట్టి, ధన్‌తేరస్‌ రోజున బంగారానికి బాగా డిమాండ్ ఉంటుంది. 


మన దేశంలో నివసించే వాళ్లు (Indian residents) ఎంత పసిడినైనా కొనొచ్చు. నాన్-రెసిడెంట్స్ కేటగిరీలో (NRI) ఉంటే మాత్రం కొన్ని షరతులు వర్తిస్తాయి.


సావరిన్ గోల్డ్ బాండ్స్:
NRIలు సావరిన్ గోల్డ్ బాండ్లలో (SGBలు) పెట్టుబడి పెట్టలేరు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA Act) 1999 ప్రకారం, భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తులు, HUFలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు మాత్రమే SGB కొనుగోలు చేయడానికి అర్హులు. NRIలకు ఈ అర్హత లేదు. ఇండియన్‌ రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి SGBలు కొన్నాక నాన్‌-రెసిడెంట్‌ కేటగిరీకి మారితే, అతను మెచ్యూరిటీ డేట్‌ వరకు వాటిని కొనసాగించవచ్చు. కొత్తగా కొనడానికి మాత్రం వీల్లేదు. 


ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. గోల్డ్ బాండ్ ఇన్వెస్ట్‌మెంట్ నామినీగా NRI ఉండొచ్చు, ఆ ప్రయోజనాలను పొందొచ్చు. దీనికోసం పాస్‌పోర్ట్ కాపీతో పాటు KYCని అప్‌డేట్‌ చేయాలి. సావరిన్ గోల్డ్ బాండ్‌ అంటే, బంగారంతో కూడిన ప్రభుత్వ సెక్యూరిటీలు. భౌతిక బంగారం బదులు బాండ్‌ రూపంలో పసిడిని కొనే ఆప్షన్‌ ఇది. SGBలను భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది.


గోల్డ్ ETFలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి భౌతిక & డిజిటల్ మార్గాల్లో NRIలు గోల్డ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. కానీ, ఫెమా చట్టం ‍‌ప్రకారం ఈ పెట్టుబడులకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.


NRI పెట్టుబడిదార్లు పెట్టుబడి పెట్టడానికి, లాభాలు సంపాదించడానికి ప్రభుత్వం కొన్ని గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లను అందుబాటులో ఉంచింది. వాళ్లు, బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సాధారణంగా రెండు మార్గాలు ఉన్నాయి. అవి.. భౌతిక బంగారం (Physical gold), డిజిటల్ గోల్డ్‌. 


భౌతిక బంగారం: 
పసిడిలో పెట్టుబడి పెట్టే సాంప్రదాయ మార్గం ఇది. ధన్‌తేరస్‌ మాత్రమే కాదు, భారతీయుల ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా బంగారు ఆభరణాల కొనుగోలుతో ఆ సంతోషం మరింత పెరుగుతుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పసిడి పెనవేసుకుని ఉంటుంది. బంగారం అద్భుతమైన విలువను వేల ఏళ్ల క్రితమే భారతీయులు గుర్తించారు. దానిని హోదాకు చిహ్నంగా, సురక్షితమైన పెట్టుబడి మార్గం ఉపయోగిస్తున్నారు. NRIలు, నేరుగా బంగారం దుకాణాలకు వెళ్లిగానీ, ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా గానీ భౌతిక బంగారాన్ని కొనొచ్చు. బంగారు ఆభరణాలు, నాణేలు, కడ్డీలు, బిస్కట్లు వంటి రూపాల్లో కొనుగోలు చేయవచ్చు.


డిజిటల్ బంగారం: 
డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కూడా NRIలకు అనుమతి ఉంటుంది. ఇది ఒక ఈజీ ఆప్షన్‌. ఫిజికల్ గోల్డ్‌ను ఇంట్లో పెట్టుకుని టెన్షన్‌ పడే బదులు, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు, వీటి విలువ భౌతిక బంగారానికి సమానంగా ఉంటుంది, దొంగల భయం ఉండదు. డిజిటల్‌ గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో, ఎక్కువగా వాడుకలో ఉన్న మూడు ఆప్షన్లు ఇవి:


- ఈ-గోల్డ్: ఈ-గోల్డ్ యూనిట్లను తొలిసారిగా 2010లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రవేశపెట్టింది. ఇవి, మార్కెట్‌లో లిస్ట్‌ అయిన గోల్డ్‌ యూనిట్లు, వీటితో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్‌ చేయవచ్చు. ఒక ఈ-గోల్డ్ యూనిట్ విలువ 1 గ్రాము బంగారం ధరకు సమానం.


- గోల్డ్ ఫండ్స్: పేరులో ఉన్నట్లుగా, గోల్డ్ ఫండ్స్ అంటే బంగారాన్ని ప్రైమరీ కమొడిటీగా కలిగిన ఫండ్స్. గోల్డ్ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోలో ఉంటే, మార్కెట్‌ ఒడిదొడుకుల్లో మీ పెట్టుబడిని బ్యాలెన్స్‌ చేస్తాయి, రిస్క్‌ను తగ్గిస్తాయి. 


- గోల్డ్ ETF: ఈటీఎఫ్‌ అంటే ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌. వీటిలో అంతర్లీన ఆస్తిగా బంగారం ఉంటుంది, ఈ ఫండ్స్‌ ఎక్సేంజ్‌లో ట్రేడ్‌ అవుతాయి. ETF రిటర్న్స్ & రిస్క్ అనేవి మార్కెట్‌లో కొనసాగుతున్న బంగారం విలువను ప్రతిబింబిస్తాయి. ఉత్తమ పాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లలో ఇది ఒకటి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.