PM Modi Slams Nitish Kumar:


ప్రధాని మోదీ ఆగ్రహం..


జనాభా నియంత్రణపై అసెంబ్లీలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పటికే ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ విమర్శలు ఆగడం లేదు. పలువురు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇంత కన్నా సిగ్గుచేటు మరోటి ఉండదంటూ ఫైర్ అవుతున్నారు. ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. నితీశ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్‌పై విపక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. మహిళల పట్ల అంత నీచంగా మాట్లాడడం దేశ ప్రతిష్ఠకే అవమానకరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీశ్ పేరు ప్రస్తావించకుండానే చురకలు అంటించారు. 


"ఘమండియా ఘట్‌బంధన్‌ I.N.D.I.A కూటమిలో ఓ సీనియర్ నేత మహిళల పట్ల అత్యంత నీచంగా మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయినా వాళ్లకు ఏ మాత్రం సిగ్గుగా అనిపించడం లేదు. విపక్ష కూటమిలో ఒక్కరు కూడా ఆ వ్యాఖ్యలపై స్పందించలేదు. ఎవరూ ఖండించలేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వాళ్లు మహిళల కోసం మంచి చేస్తారని ఎలా నమ్మగలం. మన తల్లులు, సోదరీమణుల ఇలా మాట్లాడి దేశ పరువు తీస్తున్నారు. ఇంకా ఎంత దిగజారిపోతారు"


- ప్రధాని నరేంద్ర మోదీ


 






కేసు నమోదు..


నితీశ్ చేసిన వ్యాఖ్యలపై ముజఫర్‌పూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌లో ఫిర్యాదు నమోదైంది. జనాభా నియంత్రణ మహిళల వల్లే సాధ్యమవుతుందన్న విషయాన్ని చాలా నీచంగా మాట్లాడారని ఆ కంప్లెయింట్‌లో ప్రస్తావించారు. అసెంబ్లీ సాక్షిగా దారుణమైన భాష వినియోగించారని తెలిపారు. ఈ ఫిర్యాదుపై కోర్టు నవంబర్ 25న విచారణ చేపట్టనుంది.






జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నితీశ్ కుమార్ ఆ తరవాత క్షమాపణలు చెప్పారు. తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. జనాభా నియంత్రణ విషయంలో మహిళల అవగాహన గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో నోరు జారారు నితీశ్. రాష్ట్రంలో ఫర్టిలిటీ రేట్‌ 4.2% నుంచి 2.9%కి పడిపోయింది. దీనిపై చర్చిస్తున్న సమయంలోనే కాస్త వివాదాస్పద భాష వాడారు. దీనికి వివరణ ఇస్తూ "నా వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించండి. ఆ మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను" అని చెప్పారు.


Also Read: మూడోసారి ప్రధాని అయ్యాక ఇండియా ఎకానమీని నంబర్ 3 స్థానానికి తీసుకెళ్తా - మోదీ ధీమా