Delhi Air Pollution:
ఢిల్లీలో వర్షం..
Delhi Rains: ఢిల్లీ ప్రజలు దాదాపు వారం రోజుల (Delhi Air Pollution) తరవాత ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్నాళ్లూ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన దేశ రాజధానికి కాస్త ఊరట లభించింది. ఉన్నట్టుండి వర్షం కురవడం వల్ల గాలి నాణ్యత (Delhi Air Quality) కొంత వరకూ మెరుగు పడింది. AQI ఇంకా "Severe" కేటగిరీలోనే ఉన్నప్పటికీ మునుపటితో పోల్చుకుంటే ఉపశమనం దొరికింది. ఈ ఉదయం (నవంబర్ 10) 6 గంటల సమయానికి గాలి నాణ్యత అలాగే ఉందని, భారీ మార్పు ఏమీ కనిపించలేదని Central Pollution Control Board (CPCB) డేటా వెల్లడించింది. అశోక్ విహార్‌లో 462, ఆర్‌కే పురంలో 461గా గాలి నాణ్యత నమోదైంది. అయితే...కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం కారణంగా గాలి నాణ్యత పెరిగిందని అధికారులు వెల్లడించారు.
నోయిడాలో మాత్రం ఈ వర్ష ప్రభావం కనిపించడం లేదు. అక్కడి ఎయిర్ క్వాలిటీ ఇంకా ప్రమాదకరంగానే ఉంది. ఫరియాబాద్, గుడ్‌గావ్, ఘజియాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. ఏదేమైనా ఇలా రెండు మూడు రోజుల పాటు వర్షాలు పడితే పరిస్థితులు సాధారణానికి వస్తాయని స్థానికులు చెబుతున్నారు.
"వర్షం పడిన తరవాత ఇవాళ కాస్త వాతావరణం మెరుగ్గా ఉంది. అంతకు ముందు ఎక్కడ చూసినా పొగమంచు, దుమ్ముధూళి కనిపించాయి. కానీ ఇప్పుడా పరిస్థతి లేదు. అయినా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు మాస్క్‌లు పెట్టుకునే బయటకు రావాలి"
- స్థానికుడు
నిజానికి ఢిల్లీలో కృత్రిమ వర్షాలు సృష్టించాలని ఇటీవలే ప్రభుత్వం యోచించింది. ఇంతలోనే అకస్మాత్తుగా వర్షం పడింది. అయినా కాలుష్య కట్టడి చర్యలు ఆపొద్దని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పలువురు మంత్రులూ రంగంలోకి దిగి ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు.
ఢిల్లీలో కాలుష్య తీవ్రతను (Delhi Air Pollution) తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు చేపడుతోంది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. కృత్రిమ వర్షాన్ని సృష్టించి కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలని చూస్తోంది. నవంబర్ 20-21 తేదీల్లో ఆర్టిఫిషియల్ రెయిన్ (Delhi Artificial Rain) సృష్టించాలని భావిస్తోంది. ఇప్పటికీ అక్కడి గాలి నాణ్యత (Delhi Air Quality) ఏ మాత్రం మెరుగవలేదు. పైగా రోజురోజుకీ మరింత దిగజారిపోతోంది. పైగా పొరుగు రాష్ట్రాల్లో రైతులు వరి గడ్డిని పెద్ద ఎత్తున (Stubble Burning) కాల్చుతున్నారు. ఫలితంగా పొగ కమ్ముకుంటోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక మంత్రి అతిశి ఐఐటీ కాన్పూర్ ( IIT Kanpur) టీమ్‌తో సమావేశమయ్యారు. ఆ టీమ్ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. కృత్రిమ వర్షం సృష్టిస్తే కొంత వరకూ ఫలితం ఉండే అవకాశముందని సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో ఓ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఈ రిపోర్ట్ వచ్చిన తరవాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఆ నివేదికను సమర్పించనుంది. అయితే...ఈ ప్లాన్ అమలు చేయకముందే వర్షం పడడం కొంత ఊరటనిచ్చింది.
Also Read: డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ఆ కీలక బిల్లులపై కేంద్రం ఫోకస్!