Parliament Winter Session 2023: 



డిసెంబర్ 4-22 వరకూ సమావేశాలు..


పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకూ జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. 19 రోజుల్లో 15 సార్లు సమావేశాలు జరుగుతాయని షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు అధికారికంగా ట్వీట్ చేశారు. 


"2023 పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. 19 రోజుల్లో 15 సిట్టింగ్స్‌ జరుగుతాయి. ఈ అమృత కాల్‌లో భాగంగా జరుగుతున్న సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నాను. కీలకమైన అంశాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నాను"


- ప్రహ్లాద్ జోషి, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి 






ఆ మూడు బిల్లులపైనే ఫోకస్..? 


ప్రస్తుతానికి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అన్ని పార్టీలూ గ్రౌండ్‌లో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 3వ తేదీన అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ మరుసటి రోజే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. ఈ సమావేశాల్లో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.  Indian Penal Codeతో పాటు Criminal Procedure Code, Evidence Act బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇటీవలే స్టాండింగ్ కమిటీ వీటిపై ఓ రిపోర్ట్ తయారు చేసింది. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఏటా నవంబర్ మూడో వారంలో ప్రారంభమవుతాయి. డిసెంబర్ 25 లోగా ముగిసిపోతాయి. కానీ ఈ సారి ఈ సంప్రదాయాన్ని మార్చేసింది కేంద్రం. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు  (Lok Sabha elections 2024 )జరగనున్నాయి. ఆలోగానే కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టాలని చూస్తోంది. అయితే..ఈ మూడు బిల్లులతో పాటు మరో కీలకమైన బిల్‌నీ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్స్ నియామకాలకు సంబంధించిన బిల్ తీసుకొస్తారని సమాచారం.