Delhi Air Pollution:
ఉక్కిరిబిక్కిరి..
ఢిల్లీలో గాలి నాణ్యత అంతకంతకూ పడిపోతోంది. ఇప్పటికే కాలుష్యం అక్కడి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎయిర్ క్వాలిటీ మరింత ఆందోళనకరంగా ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో (Delhi Air Quality Index) 309గా నమోదైందని ప్రకటించింది. అంతకు ముందు రోజు 261గా ఉండగా...ఇప్పుడు మరింత తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మరింత తగ్గిపోయే ప్రమాదముందని ఇప్పటికే వెదర్ మానిటరింగ్ ఏజెన్సీలు హెచ్చరించాయి. ఢిల్లీతో పాటు నోయిడాలోనూ ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం అక్కడి వాయు నాణ్యతను "Very Poor" కేటగిరీలో చేర్చారు. AQI 372గా ఉందని వెల్లడించారు. గుడ్‌గావ్‌లో 221గా నమోదైంది. PTI వెల్లడించిన వివరాల ప్రకారం...ఢిల్లీలో అక్టోబర్ 26న ఎయిర్ క్వాలిటీ 256గా నమోదైంది. అంతకు ముందు అక్టోబర్ 25న 243గా ఉంది. దాదాపు వారం రోజులుగా AQI "Poor"గానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఘజియాబాద్‌లో AQI 291గా నమోదైంది. ఫరియాబాద్‌లో 272, గుడ్‌గావ్‌లో 252, నోయిడాలో 284, గ్రేటర్ నోయిడాలో 346గా నమోదయ్యాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో Air Quality Early Warning System ఉంది. ఇది ఎప్పటికప్పుడు అక్కడి వాతావరణ పరిస్థితులను సమీక్షిస్తూ ఉంటుంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు వెల్లడించింది.
దీపావళికి పరిస్థితి ఏంటో..
మరో రెండు వారాల్లో దీపావళి పండుగ రానుంది. అప్పటికి వాతావరణం మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదముందని తెలిపింది. దీనిపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ స్పందించారు. పొరుగు రాష్ట్రాల్లో వరి గడ్డిని కాల్చడం తగ్గిందని, ఈ సారి కాలుష్యం తక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించారు. ఇప్పటి వరకూ వరి గడ్డిని కాల్చిన ఘటనలు 2,500 వరకూ నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 5 వేల ఘటనలు నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితులపై ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలికాలం ఇంకా పూర్తిగా మొదలు కాకముందే కాలుష్య స్థాయి తీవ్రంగా పెరిగిపోయిందని అంటున్నారు. ఉదయం 5 గంటల నుంచే పొగ మంచు కప్పేస్తోంది. కాసేపు కూడా బయట ఉండేందుకు వీల్లేకుండా పోతోంది. మార్నింగ్ వాక్‌కి వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యాన్ని భరించలేక వెనక్కి మళ్లుతున్నారు. చాలా మంది శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దసరా వేడుకల్లో బాణసంచా కాల్చడమూ కాలుష్యాన్ని పెంచేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కీలక విషయాలు వెల్లడించారు. ఢిల్లీలో 8 పొల్యూషన్ హాట్‌స్పాట్స్‌ని (Delhi Pollution Hotspots) గుర్తించినట్టు చెప్పారు. ఇప్పటికే 13 హాట్‌స్పాట్‌లను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా మరో 8 ఆ జాబితాలో చేర్చింది. గాల్లోని దుమ్ముని తగ్గించేందుకు ప్రత్యేక పౌడర్‌ని వినియోగించనుంది.
Also Read: కేరళలో ప్రార్థనలు చేస్తుండగా భారీ పేలుళ్లు, ఒకరు మృతి - హమాస్ పనేనా?