Kerala Blast: 



కొచ్చిలో ఘటన..


కేరళలోని కొచ్చిలో కన్వెన్షన్ సెంటర్‌లో (Kochi Blast) భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రార్థనలు జరుగుతుండగా వరుసగా పేలుళ్లు సంభవించాయి. కొచ్చిలోని కలమస్సెరీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 27న ఈ మీటింగ్‌ మొదలు కాగా నేటితో ఇది ముగియనుంది. ఈ చివరి రోజే పేలుళ్లు సంభవించడం ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 2 వేల మంది ఉన్నారు. 






ఈ పేలుళ్లకు ఒక్క రోజు ముందే హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ మాజీ చీఫ్ ఖలీద్ మషల్ పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఆందోళనలకు మద్దతు తెలిపాడు. వర్చువల్‌గా ఈ ఆందోళనల్లో పాల్గొన్నాడు. దీనిపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. దేశంలో విద్వేషాలు పెంచడంతో పాటు అల్లర్లు సృష్టించేందుకు సోషల్ మీడియాని ఆయుధంగా మార్చుకుంటున్నారన్న వాదనలు వినిపించాయి. ఇది జరిగిన మరుసటి రోజే కేరళలో పేలుళ్లు సంభవించడం అలజడి సృష్టించింది.ఈ పేలుళ్లపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. సెలవులో ఉన్న వాళ్లు కూడా పని చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. వైద్యులనూ అలెర్ట్ చేశారు. అవసరమైతే అదనపు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎర్నాకులంలోని జనరల్ హాస్పిటల్‌లో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. 


 






ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ పేలుళ్లపై తీవ్రంగా స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు వెల్లడించారు. ఘటనా స్థలానికి ఉన్నతాధికారులంతా వెళ్తున్నారని స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పినరయి విజయన్‌కి కాల్ చేసి ఈ ఘటనపై ఆరా తీశారు. 


"ఇది చాలా దురదృష్టకరం. ఘటనకు సంబంధించిన అన్ని వివరాలనూ సేకరిస్తున్నాం. DGP ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మిగతా ఉన్నతాధికారులూ వెళ్లారు. ఈ ఘటనలు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం"


- పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి