Israel Palestine Attack: 



ఫోన్‌ కాల్‌..


ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై (Israel Hamas War) ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఎల్ సిసీతో ( Abdel Fattah el-Sisi) మాట్లాడారు. రోజురోజుకీ అక్కడి పరిస్థితులు దిగజారిపోతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. మానవతా సాయం అందించాల్సిన అవసరాన్నీ చర్చించారు. ఉగ్రవాదుల దాడులు, హింసాత్మక ఘటనలు, పౌరుల మరణాలపై ఇద్దరు నేతలూ ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని అభిప్రాయపడ్డారు. ప్రభావిత ప్రాంతాల్లోని  పౌరులకు సాయం అందించేందుకు ముందుండాలని నిర్ణయించుకున్నారు. ఫోన్‌లో అబ్దెల్‌ ఫతేతో మాట్లాడిన ప్రధాని...ఆ తరవాత ట్విటర్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు. 


"ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఎల్ సిసీతో మాట్లాడాను. వెస్ట్ ఆసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉండడంపై చర్చించాం. ఉగ్రవాదం, హింసాత్మక ఘటనలు, వేలాది మంది పౌరుల మరణాలు కలిచివేశాయి. వీలైనంత వేగంగా అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని నిర్ణయించుకున్నాం. మానవతా సాయం చేసేందుకూ అంగీకరించాం"


- ప్రధాని నరేంద్ర మోదీ






మరింత ప్రమాదకరం..


గాజా సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ఇద్దరు నేతలూ చర్చించారని ఈజిప్ట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ అబ్దెల్ ఫతేకి కాల్ చేసి మాట్లాడారని తెలిపారు. ఇవే పరిస్థితులు కొనసాగితే యుద్ధం మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు వివరించారు ఈజిప్ట్ ప్రతినిధి. 


"మా అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఎల్ సిసీకి భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాల్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం గాజా వద్ద పరిస్థితులపై ఇద్దరూ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ యుద్ధం మరింత ముదరక ముందే చొరవ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు."


- ఈజిప్ట్ ప్రతినిధి


నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) ప్రెసిడెంట్ శరద్ పవార్‌ ఇజ్రాయేల్‌ హమాస్ యుద్ధంపై (Israel Hamas War) స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా కన్‌ఫ్యూజన్‌ స్టేట్‌లోనే ఉందని విమర్శించారు. పాలస్తీనా వ్యవహారంలో ఏ వైపు నిలబడాలో తేల్చుకోలేకపోతోందని అన్నారు. చరిత్రను గమనిస్తే భారత్ ఎప్పుడూ పాలస్తీనాకే మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. ఇజ్రాయేల్‌కి ఎప్పుడూ అండగా ఉండలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయేల్‌కి మద్దతునిచ్చారని, కానీ విదేశాంగ శాఖ మంత్రి అందుకు భిన్నమైన ప్రకటన చేసిందని అన్నారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై హమాస్ దాడులు మొదలయ్యాయి. అక్టోబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై స్పందించారు. ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించిందని ప్రకటించారు. ఇజ్రాయేల్‌కి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్టోబర్ 10వ తేదీన ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహుతో ప్రధాని మోదీ మాట్లాడారు. రెండ్రోజుల తరవాత అక్టోబర్ 12న విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బగ్చీ (Arindam Bagchi) స్పందించారు. పాలస్తీనాకు స్వతంత్ర హోదా ఇచ్చే విషయంలో భారత్ ఎప్పుడూ అండగానే ఉంటుందని, అందుకు మద్దతునిస్తుందని ప్రకటించారు. దీనిపైనే శరద్ పవార్ విమర్శలు చేశారు. 


Also Read: కేరళలో ప్రార్థనలు చేస్తుండగా భారీ పేలుళ్లు, ఒకరు మృతి - హమాస్ పనేనా?