భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అగ్ర జట్లకు పసికూనలు షాక్‌ ఇస్తుండడం.. సెమీస్‌ బెర్తులపై స్పష్టత రాకపోవడం.. రోహిత్‌ శర్మ సారధ్యంలోని టీమిండియా అప్రతిహాత విజయాలతో ముందుకు దూసుకుపోతుండండంతో ప్రపంచకప్‌పై ఆసక్తి బాగా పెరిగింది. క్రికెట్‌ ప్రేమికులు కేవలం భారత్‌ ఆడే మ్యాచ్‌లనే కాకుండా వేరే జట్ల మ్యాచ్‌లను కూడా టీవీలకు అతుక్కుపోయి మరీ వీక్షిస్తున్నారు. అయితే ప్రపంచకప్‌ మేనియాలో దేశం ఊగిపోతున్న వేళ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. దేశంలో క్రికెట్‌ మేనియాకు ఇదే నిదర్శనమంటూ జై షా ట్వీట్‌ చేశాడు. ప్రపంచకప్‌ను టీవీల్లో వీక్షించే వారి సంఖ్య గత ప్రపంచకప్‌తో పోలిస్తే 43 శాతం వృద్ధి చెందిందని జై షా ట్వీట్‌ చేశాడు. టీవీ వీక్షకుల సంఖ్య అనూహ్యంగా భారీగా పెరిగిందని వెల్లడించారు.

 

2019లో ప్రపంచకప్‌తో పోలిస్తే వీక్షణ నిమిషాల్లో 43 శాతం వృద్ధి ఉందని జై షా తెలిపాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను టీవీలో 36.42 కోట్ల మంది వీక్షించారని వివరించాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇదో కొత్త రికార్డు అని జైషా ట్వీట్‌లో పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఛానెల్‌ను వీక్షించే వారి సంఖ్య 43 శాతం పెరిగిందని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే.. అభిమానులు గతంలో కంటే ఈసారి టీవీకి ఎక్కువగా అతుక్కుపోయారని.. ఇది భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణకు, భారత క్రికెట్ అభిమానుల శక్తికి నిదర్శనమని జై షా ట్వీట్ చేశాడు. 

 

ఈ ప్రపంచకప్‌లో మొదటి 18 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని 364.2 మిలియన్ల మంది చూశారని ఐసీసీ తెలిపింది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను టీవీల్లో 76 మిలియన్ల మంది, డిజిటల్‌లో 35 మిలియన్ల మంది వీక్షించారని వెల్లడించింది. అక్టోబరు 22న ధర్మశాలలో భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ 21వ మ్యాచ్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 43 మిలియన్ల మంది చూశారు. అంటే భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను అత్యధికంగా 4.3 కోట్ల మంది వీక్షించారన్న మాట. ప్రపంచ వీక్షకుల సంఖ్యలో ఇది కొత్త రికార్డు. ఆరంభంలో భారత్ వికెట్లు పడినప్పుడు టీమిండియా ఓడిపోతుందేమో అనిపించినా... క్రీజులో విరాట్ కోహ్లీ స్ట్రాంగ్‌గా ఉండడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. చివర్లో మ్యాచ్‌ని చూసేందుకు చాలా మంది యాప్‌లోకి వచ్చారు. దీంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సరికొత్త రికార్డు సృష్టించింది.

 

ఇక ఈ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా మరో మ్యాచ్‌కు సిద్దమైంది. లక్నో వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఏడాది కిందట జరిగిన టీ 20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఎదురైన ఓటమికి బలంగా ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. వరుస ఓటములతో సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లాండ్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేసిన టీమిండియాకు షాక్‌ తప్పదు. కానీ ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన బ్రిటీష్‌ జట్టు... అన్నింటికి తెగించి ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌ చేరేందుకు మరింత చేరువకానున్న నేపథ్యంలో రోహిత్‌ సేన ఎలాంటి అలసత్వానికి చోటు ఇవ్వకుండా విజయం సాధించాలని చూస్తోంది. ఇప్పటివరకూ అప్రతిహాత జైత్రయాత్రతో ముందుకు సాగిపోతున్న టీమిండియా.. అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది.