ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ మరో సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో సెమీఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు పరాజయాల పరంపరను కొనసాగించిన బంగ్లాదేశ్‌ ఈ మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు షాక్‌ ఇచ్చిన డచ్‌ జట్టు... ఇప్పుడు బంగ్లాకు షాక్‌ ఇచ్చి తమ గెలుపు గాలివాటం కాదని నిరూపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన . కోల్‌కత్తా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 230 పరుగుల కష్ట సాధ్యం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కేవలం 42.2  ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. దీంతో నెదర్లాండ్స్‌ 87 పరుగుయా భారీ తేడాతో విజయం సాధించింది.  ఈ విజయంతో  ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో నెదర్లాండ్స్‌ ఎగబాకగా... బంగ్లా దిగజారింది.

 

మరోసారి  ఎడ్వర్డ్స్‌ కీలక ఇన్నింగ్స్‌

సెమీఫైనల్స్‌ చేరాలనే ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ ఆరంభంలోనే డచ్‌ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జట్టు స్కోరు మూడు పరుగుల వద్దే నెదర్లాండ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. భారత సంతతి ఆటగాడు విక్రమ్‌జిత్‌ సింగ్‌ను తస్కిన్ అహ్మద్‌ అవుట్‌ చేసి డచ్ జట్టును తొలి దెబ్బ కొట్టాడు. ఈ దెబ్బ నుంచి కోలుకునేలోపే నెదర్లాండ్స్‌ మరో వికెట్‌ కోల్పోయింది. నాలుగు పరుగుల వద్ద మరో ఓపెనర్‌ మ్యాక్స్‌ ఓ డౌడ్‌ను షోరిఫుల్‌ ఇస్లాం అవుట్‌ చేశాడు. డకౌట్‌గా ఓడౌడ్‌ వెనుదిరిగాడు. నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన నెదర్లాండ్స్‌ను వెస్లీ బారేసి, కోలిన్‌ ఆకెర్‌మాన్ ఆదుకున్నారు.  తర్వాత స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ 89 బంతుల్లో ఆరు ఫోర్లతో 68 పరుగులు చేసి నెదర్లాండ్స్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ కీలక ఇన్నింగ్స్‌ ఆడి నెదర్లాండ్స్‌ జట్టు స్కోరును 200ల దిశగా నడిపించాడు. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 61 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. అర్ధ సెంచరీ దిసగా సాగుతున్న ఎంగెల్‌బ్రెచ్ట్‌ను మహేదీ హసన్‌ అవుట్‌ చేశాడు. దీంతో 185 పరుగుల వద్ద నెదర్లాండ్స్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. లాగన్ వాన్‌ బీక్‌ రాణించడంతో నెదర్లాండ్స్‌... బంగ్లా ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. 16 బంతుల్లో 1 సిక్సు, రెండు ఫోర్లతో వాన్‌ బీక్‌ 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్‌ అయింది.

 

 అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి బంగ్లాదేశ్‌.. ఏ దశలోనూ లక్ష్యం సాధించే దిశగా కనిపించలేదు. సమష్టిగా రాణించిన నెదర్లాండ్స్‌ బౌలర్లు... బంగ్లా పులులను ముప్పు తిప్పలు పెట్టారు. 19 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లా..  ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. డచ్‌ బౌలర్ల విజృంభణలో 70పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. బంగ్లా బ్యాటర్లలో అత్యధిక స్కోరు 35 పరుగులే అంటే డచ్‌ బౌలింగ్‌ ఎలా సాగిందో చెప్పవచ్చు.  హసన్ మిరాజ్‌ ఒక్కటే 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో బంగ్లాదేశ్‌ కేవలం 42.2  ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. దీంతో నెదర్లాండ్స్‌ 87 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. డచ్ బౌలర్ పాల్ బాన్ మీక్రేన్ 23 పరుగులుకే  4 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు.  ఈ పరాజయంతో బంగ్లా సెమీస్‌ ఆశలు గల్లంతయ్యాయి .