ప్రపంచకప్‌లో వరుస ఓటములతో తడబడుతున్న పాకిస్థాన్‌ జ్టటుపై విమర్శల జడి వాన కురుస్తోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో పాక్‌కు సెమీస్‌ చేరే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. పాక్‌ జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో పాక్ సారధి బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు పాక్‌ ఆటగాళ్లపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 


ప్రపంచకప్‌లో వరుస ఓటములతో పాకిస్థాన్‌ నైరాశ్యంలో కూరుకుపోయింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో మాత్రమే గెలిచి సెమీస్‌ రేసులో చాలా వెనుకబడింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచినా సెమీ ఫైనల్స్‌కు వచ్చే అవకాశాలు తక్కువే. పాక్ ఆటగాళ్లు అంచనాల మేరకు రాణించకపోవడంతో వారిపై ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలవ్వడంపై పాక్ సారధి బాబర్‌ ఆజమ్‌ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. తాము ఆరంభంలో బాగా ఆడినా ముగించడంలో మాత్రం వెనకపడ్డామని బాబర్‌ అన్నాడు. ఈ ఓటమి తమల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని పాక్‌ సారధి అన్నాడు. కానీ ఇప్పుడు పాక్ మాజీ రషీద్‌ లతీఫ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. 


అయిదు నెలలుగా జీతాల్లేవ్‌
 పాకిస్థాన్ జట్టుకు గత అయిదు నెలలుగా వేతనాలు అందడం లేదని పాక్‌ మాజీ కెప్టెన్ రషీద్‌ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లకు పీసీబీ నుంచి సరైన సహకారం లభించడం లేదని... పాక్‌ ఆటగాళ్ల దారుణ ప్రదర్శనలకు అది కూడా ఓ కారణమని లతీఫ్‌ ఆరోపించారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నుంచి ఆటగాళ్లకు సరైన సహకారం లభించడం  లేదని... ఐదు నెలలుగా క్రికెటర్లకు పీసీబీ జీతాలు కూడా చెల్లించడం లేదని ఆరోపించాడు. జీతాల విషయంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డును సారధి బాబర్‌ ఆజమ్‌ సంప్రదిస్తున్నా వారు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని లషీద్‌ లతీఫ్‌ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు లతీఫ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.


రెండు రోజులుగా ఆజమ్‌ పీసీబీ ఛైర్మన్‌కు జీతాలు ఇవ్వాలని మెసేజ్‌లు చేస్తున్నా అటువైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌ మెసేజ్‌ చేస్తే కనీసం పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు స్పందించకపోవడంపై లతీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు పీసీబీలో ఏం జరుగుతోందని సూటిగా నిలదీశాడు. ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్లు సంతకం చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లను పున:పరిశీలిస్తామని పీసీబీ చెబుతోందని, ఐదు నెలలుగా ఆటగాళ్లకు జీతాలు అందలేదు. అలాంటప్పుడు వారు ఎలా ఆడతారని లతీఫ్‌ నిలదీశాడు.


ఇక ప్రపంచకప్‌లో వరుస ఓటములపై పాక్‌ సారధి బాబర్‌ ఆజమ్ తీవ్ర నిర్వేదం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి సెమీ ఫైనల్ రేసులో ఉండాలని భావించామని కానీ అలా చేయలేక పోయామని అన్నాడు. కానీ రాబోయే 3 మ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తామన్నాడు. సెమీస్‌ చేరేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదలబోమని.. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని బాబర్‌ అన్నాడు. అయితే బాబర్‌ అజామ్ నాయక్వత ప్రతిభపైనా విమర్శలు వస్తున్నాయి. మూడేళ్ల నుంచి కెప్టెన్‌గా ఉన్నా సారథిగా బాబర్‌కు పరిపక్వత సాధించలేదని పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌  విమర్శించాడు. బాబర్‌ మంచి ఆటగాడే అయినా అతడిని గొప్ప ప్లేయర్‌గా పోల్చడం సరికాదన్నాడు.


మూడేళ్లుగా కెప్టెన్సీ చేస్తున్న వ్యక్తి సారధిగా ఇంకా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో పరిపక్వత సాధించకపోవడంపై హఫీజ్‌ మండిపడ్డాడు. బాబర్ ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రస్తుతం అతడు పాక్‌ కెప్టెన్‌. కాబట్టి మనం బాబర్‌కు మద్దతివ్వాలి. అయితే, అతడు తన ఆటను మెరుగుపరుచుకుని మరింత దూకుడుగా ఆడాలని సూచించాడు. ఈ విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ విజయం సాధించాడని, సారథిగా, ఆటగాడిగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడని మహ్మద్‌ హఫీజ్‌ వివరించాడు.