ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ను బంగ్లాదేశ్‌ తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. కోల్‌కత్తా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో229 పరుగులకు ఆలౌట్‌ అయింది. సెమీఫైనల్స్‌ చేరాలనే ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ ఆరంభంలోనే డచ్‌ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జట్టు స్కోరు మూడు పరుగుల వద్దే నెదర్లాండ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 9 బంతుల్లో మూడు పరుగులు చేసి క్రీజులో కుదురుకునేందుక ప్రయత్నిస్తున్న భారత సంతతి ఆటగాడు విక్రమ్‌జిత్‌ సింగ్‌ను తస్కిన్ అహ్మద్‌ అవుట్‌ చేసి డచ్ జట్టును తొలి దెబ్బ కొట్టాడు. ఈ దెబ్బ నుంచి కోలుకునేలోపే నెదర్లాండ్స్‌ మరో వికెట్‌ కోల్పోయింది. నాలుగు పరుగుల వద్ద మరో ఓపెనర్‌ మ్యాక్స్‌ ఓ డౌడ్‌ను షోరిఫుల్‌ ఇస్లాం అవుట్‌ చేశాడు. డకౌట్‌గా ఓడౌడ్‌ వెనుదిరిగాడు. నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన నెదర్లాండ్స్‌ను వెస్లీ బారేసి, కోలిన్‌ ఆకెర్‌మాన్ ఆదుకున్నారు.



 ఆచితూచి బ్యాటింగ్‌ చేసిన వీరిద్దరూ నెమ్మదికా స్కోరు బోర్డును కదిలించారు.  మూడో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ విడదీశాడు. 41 బంతుల్లో 41 పరుగులు చేసిన వెస్లీ బారేసిని ముస్తాఫిజుర్‌ అవుట్ చేశాడు. దీంతో 63 పరుగుల వద్ద డచ్‌ జట్టు మూడో వికెట్‌ కోల్పోయింది. అదే స్కోరు వద్ద కోలిన్‌ అకెర్‌మాన్‌ను  బంగ్లా సారధి షకీబుల్‌ హసన్‌  అవుట్ చేయడంతో మళ్లీ నెదర్లాండ్స్ 69 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ నెదర్లాండ్స్‌ సారధి స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ మరోసారి ఆపద్బాందువుడి ఆవతారం ఎత్తాడు. బంగ్లా బౌలర్లు సమర్థంగా ఎదుర్కొంటూ బాస్‌ డీ లీడేతో కలిసి వడివడిగా పరుగులు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. కానీ 32 బంతుల్లో 17 పరుగులు చేసిన బాల్‌ డీ లీడేను అవుట్‌ చేసి తస్కిన్‌ అహ్మద్‌ డచ్‌ జట్టును దెబ్బకొట్టాడు. కానీ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ మాత్రం పోరాటం ఆపలేదు. 89 బంతుల్లో ఆరు ఫోర్లతో 68 పరుగులు చేసిన ఎడ్వర్డ్స్‌ను ముస్తాఫిజుర్‌ అవుట్‌ చేసి బంగ్లాకు ఉపశమనం అందించాడు. కానీ సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ కీలక ఇన్నింగ్స్‌ ఆడి నెదర్లాండ్స్‌ జట్టు స్కోరును 200ల దిశగా నడిపించాడు. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 61 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. అర్ధ సెంచరీ దిసగా సాగుతున్న ఎంగెల్‌బ్రెచ్ట్‌ను మహేదీ హసన్‌ అవుట్‌ చేశాడు. దీంతో 185 పరుగుల వద్ద నెదర్లాండ్స్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. లాగన్ వాన్‌ బీక్‌ రాణించడంతో నెదర్లాండ్స్‌... బంగ్లా ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. 16 బంతుల్లో 1 సిక్సు, రెండు ఫోర్లతో వాన్‌ బీక్‌ 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్‌ అయింది. 



 ఈ ప్రపంచకప్‌లో వరుస పరాజయాలతో డీలా పడ్డ బంగ్లాదేశ్‌ 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందేమో చూడాలి. ఈ మ్యాచ్‌ తర్వాత బంగ్లాదేశ్... డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్... గత ప్రపంచకప్‌ రన్నరప్ న్యూజిలాండ్, ఆతిథ్య భారత్‌తో తలపడనుంది. అగ్ర జట్లతో తలపడే ఈ మ్యాచ్‌లకు ముందు నెదర్లాండ్స్‌పై గెలిచి ఆత్మవిశ్వాసం పోగు చేసుకోవాలని బంగ్లా టైగర్స్‌ భావిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో షకీబ్ అల్ హసన్ నేతృత్వంలోని జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని భావించినా ఇప్పటివరకూ అలాంటిది జరగలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక పంపాలని బంగ్లా భావిస్తోంది. కానీ ఇంగ్లండ్‌ను తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేసిన డచ్‌ బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బంగ్లా కెప్టెన్ షకీబ్ ఉల్‌ హసన్‌ తన బ్యాటింగ్‌ సమస్యలను పరిష్కరించుకునేందుకు చిన్ననాటి గురువు నజ్ముల్ అబెదీన్ ఫాహిమ్‌తో కొన్ని గంటలపాటు చర్చలు జరిపారు. ప్రపంచకప్‌ మధ్యలో స్వదేశానికి వెళ్లి మరీ షకీబుల్‌ చర్చలు జరిపి వచ్చి మళ్లీ జట్టులో చేరాడు. ఈ ప్రపంచకప్‌లో షకీబ్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 56 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో రాణించి జట్టుకు రెండో విజయం అందించాలని చూస్తున్నాడు.