పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కీలక ముందడుగు పడింది. ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) బుధవారం ఓ వ్యాక్సిన్‌కు 2, 3 విడత క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అనుమతించింది. ఈ మేరకు మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనే ఫార్మా సంస్థకు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతించినట్లుగా డీసీజీఐ వర్గాలు వెల్లడించాయి. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) ప్రతిపాదన ఆధారంగా డీజీసీఏ ఈ అనుమతులు ఇచ్చింది. ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. 2, 3వ విడత క్లినికల్ ట్రయల్స్ నిర్దేశిత ప్రోటోకాల్స్ పరంగా చేపడతామని ఫార్మా సంస్థ వర్గాలు వెల్లడించాయి. 


5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రాయల్స్‌లో భాగంగా దేశంలో 10 చోట్ల దీన్ని నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా దేశీయంగా అభివృద్ధి అయిన జైడుస్ కాడిలాకు చెందిన నోటి ద్వారా వేసే కొవిడ్ వ్యాక్సిన్ జైకోవ్-డి దేశంలోనే తొలి వినియోగ అనుమతి పొందింది. ఇది 12 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు వారికి వేసేందుకు అనుమతి ఉంది. మరోవైపు, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చిన్న పిల్లల కోవాగ్జిన్ 2 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు వేసేందుకు ప్రస్తుతం 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది.


2 నుంచి 17 ఏళ్ల పిల్లలకు ఇచ్చే ఉద్దేశంతో రూపొందించిన కొవోవాక్స్ వ్యాక్సిన్‌కు 2, 3వ విడత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీజీసీఐ గత జులైలోనే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు అనుమతించింది. బయోలాజికల్ ఈ పెద్దల కోసం తయారు చేసిన కార్బేవాక్స్ వ్యాక్సిన్ ప్రస్తుతం 2, 3 దశల ట్రయల్స్‌లో ఉంది. అయితే, ‘బయోలాజికల్ ఈ’ సంస్థ 30 కోట్ల డోసుల కార్బేవాక్స్ టీకాలను డిసెంబరు కల్లా కేంద్రానికి అందజేయనుంది. ఈ విషయాన్ని కేంద్రమే గత జూన్‌లో వివరించింది. 


Also Read: YS Vijayalakshmi Meet: వైఎస్ విజయలక్ష్మి ఆత్మీయ భేటీ నేడే, దీని వెనుక రాజకీయం అదేనా..? జగన్, షర్మిల హాజరవుతారా..?


బయోలాజికల్ ఈ తయారు చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం తొలి నుంచి మూడో దశ ట్రయల్స్ వరకూ భారత ప్రభుత్వం మద్దతు ఇస్తూ వస్తోంది. బయోటెక్నాలజీ శాఖ రూ.100 కోట్లకు పైగా గ్రాంట్-ఇన్-ఎయిడ్ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, తన రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (THSTI) ద్వారా అన్ని జంతు సంబంధిత పరీక్షల అధ్యయనాలను నిర్వహించడానికి బయోలాజికల్ ఈ తో భాగస్వామ్యం చేసింది. ఈ విషయాన్ని గతంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.