ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 9వ విడత నిధులను విడుదల చేశారు. ఈ క్రమంలో రూ.2 వేలు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పథకం అయిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఇప్పటివరకు నేరుగా 12 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇంకా కొంత మందికి ఈ పథకం కింద డబ్బులు తమ ఖాతాల్లో జమ కాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. డబ్బు మీ ఖాతాలోకి రాకపోతే, మీరు వెంటనే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయవచ్చు.
ఎలా ఫిర్యాదు చేయాలంటే..
మీ ఖాతాలో రూ.2 వేలు రాకపోయి ఉంటే మీరు ముందుగా మీ ప్రాంతంలోని అకౌంటెంట్ మరియు వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. ఒకవేళ వీరి నుంచి స్పందన రాకుంటే మీరు దానికి సంబంధించిన హెల్ప్‌లైన్‌కు కూడా కాల్ చేయవచ్చు. అయితే, నిర్దేశిత సమయాల్లోనే ఈ హెల్ప్ డెస్క్ తెరిచి ఉంటుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే ఈ హెల్ప్ డెస్క్ తెరిచి ఉంటుంది. ఇలా కాకుండా, ఇంకా మీరు ఈ-మెయిల్ pmkisan-ict@gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. డైరెక్ట్ హెల్ప్‌లైన్ నెంబరు 011-23381092 అనే నెంబరుకు కాల్ చేయవచ్చు. అర్హత ఉన్న ప్రతి రైతు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి చెందిన డబ్బులు రైతు బ్యాంకు ఖాతాకు చేరకపోతే, వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తారు. డబ్బులు రైతు ఖాతాలో చేరకుండా ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే దాన్ని సరి చేస్తారని వ్యవసాయశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
రైతులు ఈ పథకంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం స్టేటస్‌ను రైతులు ఎవరికి వారే తనిఖీ చేసుకొనే అవకాశం కల్పించారు. ఇందుకోసం పథకంలోని రైతు సంక్షేమ విభాగంలో సంప్రదించవచ్చు. ఇందుకోసం 011-23382401 ఫోన్ నంబరులోగానీ, pmkisan-hqrs@gov.in ఈ-మెయిల్ ఐడీలో గానీ సంప్రదించవచ్చు.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నంబర్లు
పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266
పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్: 155261
పీఎం కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు: 011-23381092, 23382401, 011-24300606, 0120-6025109
ఈ పథకానికి అర్హులు వీరే..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి రెండు హెక్టార్ల భూమిని లేదా అంతకంటే తక్కువ భూమిని సాగు చేస్తున్న రైతులు అర్హులు. సాగు చేసే రైతులు మన దేశ పౌరులై ఉండాలి. 2019 ఫిబ్రవరి 24న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు రూ.2 వేల నగదు బదిలీ చేసి ప్రారంభించారు.