వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్ఆర్ టీపీకి మెంటార్‌గా ఉంటున్న వైఎస్ విజయలక్ష్మి ఆత్మీయ సమావేశం నిర్వహిస్తూండటం హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి పని చేసిన వారందరికీ ముఖ్యంగా ఆయన ఆత్మీయులు... కేబినెట్ సహచరులందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. రెండో తేదీన హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోయే ఈ కార్యక్రమం ఎజెండా ఏమిటన్నదానిపై ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది.
వైఎస్ రాజకీయ సహచరులను ఆహ్వానించి రాజకీయం లేదంటే నమ్ముతారా..?
వైఎస్ విజయలక్ష్మి ఇంత వరకూ ఎప్పుడూ ఇలాంటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించలేదు. 12 ఏళ్ల తర్వాత తొలి సారిగా వైఎస్ వర్థంతి రోజున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయితే అసలు ఈ సమావేశానికి రాజకీయ ఉద్దేశాలేమీ లేవని.. కేవలం ఆత్మీయ సమావేశమని చెబుతున్నారు. అందుకే పార్టీలకు అతీతంగా అందరూ రావాలని కోరుతున్నారు. వైఎస్ చనిపోయిన తరవాత కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రం విడిపోయింది కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలంతా వివిద పార్టీల్లో చేరిపోయారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, టీఆర్ఎస్‌లలో నేతలు చేరిపోయారు. వారందర్నీ రావాలని వైఎస్ విజయలక్ష్మి ఆహ్వానిస్తున్నారు. రాజకీయం కాదని అంటున్నారు. అయితే వైఎస్ రాజకీయ సహచరులందర్నీ ఆహ్వానించి రాజకీయం లేదంటే ఎవరు నమ్ముతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
షర్మిల పార్టీ బలోపేత కోసం ప్రయత్నమా..?
రాజకీయ ఉద్దేశాలు లేవని రాజకీయ నేతలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు . ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతానం అయిన షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఇద్దరికీ వేర్వేరు పార్టీలు ఉన్నాయి. విజయలక్ష్మి ఇద్దరినీ సపోర్ట్ చేస్తున్నారు. అయితే షర్మిల పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టం లేదన్న అభిప్రాయం ఉంది. కానీ విజయలక్ష్మికి మాత్రం షర్మిల తన రాజకీయం తాను చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ప్రస్తుతానికి షర్మిలతోనే ప్రయాణం చేస్తున్నారు. షర్మిల పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. సభలు..సమావేశాలకు వెళ్తున్నారు. దీక్షలు చేస్తే షర్మిల పక్కనే ఉంటున్నారు. అంతే కాదు షర్మిల పార్టీలోకి రావాలని గత పరిచయాలతో పలువురు ప్రముఖ నేతలను కూడా ఆహ్వానిస్తున్నారన్న ప్రచారం ఉంది. అందుకే విజయలక్ష్మి ఆత్మీయ సమావేశం వెనుక రాజకీయం లేదని వారు నమ్మలేకపోతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో ఉన్న నేతలు వస్తారా...?
ఇప్పుడు విజయలక్ష్మి నిర్వహించే ఆత్మీయ సమావేశానికి షర్మిల, జగన్ వస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఇంత వరకూ ఖరారు కాలేదు. ఆయన వైఎస్ వర్థంతి రోజున ఇడుపుల పాయ వెళ్లి నివాళులు అర్పించి తాడేపల్లికి వెళ్తారు. తర్వాత హైదరాబాద్‌కు వెళ్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వెళ్లకపోవచ్చని అంటున్నారు. జగన్ వెళ్లకపోతే.. తాము వెళ్తే బాగుంటుందా అన్న ఆలోచనలో వైసీపీ మంత్రులు ఉన్నారు. ఇక టీడీపీలో ఉన్న పితాని సత్యనారాయణ వంటి వారికి కూడా ఆహ్వానాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాంటి వారు వెళ్లే అవకాశం లేదంటున్నారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్‌లో ఉన్న నేతలు హజరు కష్టమే..!
ఇక తెలంగాణలో ఉన్న వైఎస్ ఆత్మీయ నేతల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు ... టీఆర్ఎస్ లో ఉన్న వారు కూడా వెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు. షర్మిల పార్టీ పెట్టుకుంది కేవలం కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికేనన్న అనుమానం ఆ పార్టీ నేతల్లో ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో షర్మిలపై నేరుగా విమర్శలు చేశారు. దీంతో ఆయనను కాదని విజయలక్ష్మి ఆత్మీయ సమావేశానికి వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. ఇక టీఆర్ఎస్ లో ఉన్న నేతలు అసలు అలోచించే అవకాశం లేదు. వీలైనంత దూరం పాటిస్తారని అంటున్నారు. ఏ మాత్రం వైఎస్‌ను పొడిగినా అది తెలంగాణ ప్రజల్లోకే కాదు.. టీఆర్ఎస్ అధినేతకూ తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని భావిస్తున్నారు. అందుకే తెలంగాణ నుంచీ హాజరు తక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు.
జగన్, షర్మిల హాజరవుతారా..?
రాజకీయ సమావేశం కాదని ఎంత చెప్పినా రాజకీయ ఎజెండా లేకుండా ఇలాంటి సమావేశాలు పెట్టరని మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ ఆత్మీయులు భావిస్తున్నారు. రాజకీయంగా ఏమైనా లాభం అంటేనే ఎక్కువ మంది ఆ సమావేశానికి హాజరవుతారు. లేదంటే డుమ్మా కొడతారని భావిస్తున్నారు. అయితే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని వైఎస్ సహచరులు ఈ సమావేశానికి హాజయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు ఈ సమావేశానికి హాజరవనున్నారు. అసలు ఎంత మంది హాజరవుతారు..? సమావేశం తర్వాత రాజకీయం ఎలా మారుతుంది.. ? అన్న అంశాలపై రెండో తేదీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.