Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై రెండు వారాలుగా పరిశోధన చేస్తున్న ల్యాండర్, రోవర్ లు తమకు నిర్దేశించిన కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్ (నిద్రాణ స్థితి)లోకి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్ ల్యాండర్ కూడా నిద్రాణ స్థితి (Sleep Mode)లోకి వెళ్లడానికి సిద్ధమైనట్లు ఇస్రో వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 8 గంటలకు విక్రమ్ ల్యాండర్ స్లీమ్ మోడ్ లోకి వెళ్లనుందని ఇస్రో ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. నిద్రాణ స్థితిలోకి వెళ్లేందుకు టైం సెట్ చేయడానికి ముందు జరిపిన హాప్ ప్రయోగం అనంతరం కొత్త ప్రదేశంలోనూ ల్యాండర్ లోని పేలోడ్లు పని చేస్తున్నట్లు పేర్కొంది. 


హాప్ ప్రయోగం అనంతరం రాంభా, చాస్టే, ఐఎల్ఎస్ఏ పేలోడ్లు పని చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు సమాచారం ఇస్రోకు చేరినట్లు వెల్లడించంది. పేలోడ్లు అన్నీ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అయ్యాయని పేర్కొంది. ల్యాండర్ రిసీవర్్లు మాత్రం ఆన్ లోనే ఉన్నాయని తెలిపింది. సౌరశక్తి తగ్గి బ్యాటరీ ఖాళీ అయిన తర్వాత ప్రజ్ఞాన్ పక్కనే విక్రమ్ కూడా స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతుందని, ఈ ప్రక్రియ ఈ రోజు రాత్రి 8 గంటలకు జరుగుతుందని వెల్లడించింది. చంద్రునిపై మళ్లీ సూర్యుడు ఉదయించేది సెప్టెంబర్ 22వ తేదీన. అయితే ఆ రోజు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి మేల్కొంటాయని ఆశిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. ఇక హాప్ ప్రయోగం జరిగే ముందు, జరిగిన తర్వాత ల్యాండర్ స్థితికి సంబంధించిన ఫోటోలను ఇస్రో ట్విట్టర్ లో పోస్టు చేసింది.






ఇటీవలే చంద్రుడిపై ఆక్సిజన్ ఉందని తెలిపిన ప్రజ్ఞాన్ రోవర్


చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్ని సాధించుకున్నాయి. చంద్రుడిపై సౌత్ పోల్ పై తిరుగుతూ పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్... చంద్రుడి పొరల్లో ఉన్న కెమికల్ ఎలిమెంట్స్, ఖనిజాలను కనుగొంది. ప్రజ్ఞాన్ రోవర్ లోని లిబ్స్ గా పిలుచుకునే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్ స్ట్రుమెంట్ సహాయంతో చంద్రుడిపై ఉన్న ఎలిమెంట్స్ ను కన్ఫర్మ్ చేసింది ఇస్రో. అన్నింటికంటే ముఖ్యంగా చంద్రుడి ఉపరితలంపై దక్షిణధృవంపై సల్ఫర్ నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. అంత కంటే అద్భుతమైన విషయం ఏంటంటే చంద్రుడిపై ఆక్సిజన్ నిల్వలను కూడా గుర్తించింది ప్రజ్ఞాన్ రోవర్. అల్యూమినియం, కాల్షియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, సిలికాన్, టైటానియం నిల్వలను ధృవీకరించింది. 


Also Read: Drug Peddlers: డ్రగ్స్ ముఠాను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత


హైడ్రోజన్ ను వెతికే పనిలో ఉన్నామని ప్రకటించిన ఇస్రో... అందుకు సంబంధించిన రెస్పాన్స్ వేల్ లెంత్ గ్రాఫ్ ను విడుదల చేసింది. చంద్రుడి సౌత్ పోల్ పై ఉన్న కెమికల్ ఎలిమెంట్స్ ఏంటి అనే విషయాలపై ఇప్పటివరకూ ఫార్ అవే అబ్జర్వేషన్స్ తప్ప ఇన్ సైటూ సైంటిఫిక్ ఎక్స్ పెరిమెంట్స్ ఏ దేశం చేయకపోగా ఆ ఘనత సాధించిన తొలి స్పేస్ ఏజెన్సీగా ఇస్రో..తొలి దేశంగా భారత్ పేరు సంపాదించనట్లైంది. సల్ఫర్ ను సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీ దగ్గర నుంచి రాకెట్ ప్రొపల్లెంట్స్ తయారీ వరకూ ఉపయోగించుకునేందుకు అవకాశం ఉండగా..ఆక్సిజన్ ప్రాణవాయువుగా మనిషి మనుగడకు సహకరించనుంది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై చకచకా కదులుతూ ఇస్రో శాస్త్రవేత్తల శ్రమను ముందుకు తీసుకెళ్తోంది.