Harish Salve Marriage: దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే మరోసారి వివాహం చేసుకున్నారు. 68 ఏళ్ల వయస్సులో ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం లండన్ లో త్రినాను ఆయన పరిణయమాడారు. ఈ వేడుకకు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, మోడల్ ఉజ్వల రౌత్, సునీల్ మిట్టల్ ఎల్ఎన్ మిట్టల్, ఎస్పీ లోహియా, గోపి హిందూజా, సహా పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రెటిలీ ఈ పెళ్లికి హాజరయ్యారు. హరీశ్ సాల్వే వివాహానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను పలువురు తమ తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్టు చేశారు.
హరీశ్ సాల్వే మొదటి భార్య పేరు మీనాక్షి. మూడు దశాబ్దాల వీరి వైవాహిక జీవితానికి 2020 జూన్ లో ముగింపు పలికారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకరి మేరు సాక్షి కాగా, చిన్న కూతురి పేరు సానియా. తర్వాత హరీశ్ సాల్వే కరోలిన్ బ్రసార్డ్ నను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ బంధం ఎక్కువ రోజులు నిలవకుండానే విడాకులకు దారితీసింది. ప్రస్తుతం త్రినాను హరీశ్ సాల్వే మూడోపెళ్లి చేసుకున్నారు.
హరీశ్ సాల్వే.. దేశంలోని అత్యంత ప్రముఖ లాయర్లలో ఒకరు. హై ప్రొఫైల్ కేసులను వాదిస్తుంటారు. గూఢచర్య ఆరోపణలతో పాకిస్థాన్ లో ఉరిశిక్ష పడిన భారత నౌకాదళ మాజీ ఉద్యోగి కులభూషణ్ జాదవ్ తరపున అంతర్జాతీయ న్యాయస్థానంలో సాల్వే వాదనలు వినిపించారు. అప్పట్లో జాదవ్ తరఫున వాదనలు వినిపించినందుకు ఒకే ఒక్క రూపాయి ఫీజు తీసుకున్నారు. అలా అందరి ప్రశంసలు అందుకున్నారు.
టాటా గ్రూప్, రిలయన్స్ సంస్థలకు కూడా ఆయన లీగల్ అడ్వైజర్ గా ఉన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసును కూడా హరీశ్ సాల్వే వాదించారు. 1999 నుంచి 2002 వరకు సొలిసిటర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహించారు. 2003లో అంతర్జాతీయ వ్యవహారాలను సమర్థించడం ప్రారంభించారు. 2018లో కావేరీ నదీజలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో వకాల్తా పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన లండన్ లోనే నివసించడం మొదలు పెట్టారు. ఆయన 2013లో ఇంగ్లీష్ బార్ లో నియమితులయ్యారు. అదే ఏడాది క్వీన్స్ కౌన్సెల్ గా నియమితులయ్యారు. న్యాయవ్యవస్థలో ఆయన సేవలకు గానూ 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో హరీశ్ సాల్వేను సత్కరించింది. ఇటీవల ఒకే దేశం- ఒకే ఎన్నికపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో హరీశ్ సాల్వే కూడా సభ్యుడిగా ఉన్నారు.