China President Xi Jinping: భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ హాజరు కావడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. సోమవారం రోజు ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయనకు బదులుగా ప్రధాని లీ చియాంగ్ భారత్ రాబోతున్నట్లు ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలో జరిగే జీ-20 సదస్సుకు చైనా బృందానికి లీ చియాంగ్ నాయకత్వం వహిస్తారని పేర్కొంది.
2020 జూన్ లో తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో భారత సైన్యంపై చైనా సైనికులు దాడిచేశారు. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులు అయ్యారు. ఈ వివాదంతో చైనా, భారత్ మధ్య ఉద్రిక్తలు పెరిగిపోయాయి. తాజాగా భారత్ ఓ వైపు జీ-20 సదస్సుకు ఏర్పాట్లు చేస్తుంటే.. చైనా మాత్రం మరో వివాదంతో ముందుకు వస్తోంది. సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, దక్షిణ చేనా సముద్రాలను తమ దేశంలోని భూభాగంలో చెబుతూ సరికొత్త మ్యాప్ తో గొడవకు సిద్ధం అవుతోంది. దీనిపై భారత్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా... జిన్ పింగ్ భారత్ రావడం లేదు.
జీ20 సదస్సుకు AI కెమెరాలతో నిఘా
దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న G 20 సమ్మిట్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దేశాల అధినేతలు, ప్రతినిధులు వస్తుండడం వల్ల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపింది. ఢిల్లీ పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. సెక్యూరిటీని మరింత పటిష్ఠం చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) మాడ్యూల్స్‌తో నిఘా పెడుతున్నారు. AI ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా G 20 సమ్మిట్ వేదిక పరిసరాల్లో చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేస్తారు భద్రతా సిబ్బంది. అనుమానాస్పదంగా ఎవరు తిరిగినట్టు కనిపించినా వెంటనే గుర్తిస్తాయి ఈ కెమెరాలు. వీటితో పాటు సాఫ్ట్‌వేర్ అలార్మ్స్ కూడా ఏర్పాటు చేశారు.
గోడలు ఎక్కడం, పరిగెత్తడం, వంగి నడవడం లాంటివి చేస్తే ఈ AI కెమెరాలు సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేస్తాయి. National Security Guard కమాండోలతో పాటు ఇండియన్ ఆర్మీ స్నైపర్స్ భారీ బిల్డింగ్‌లపై పహారా కాయనున్నారు. వీరితో పాటు ఇంటర్నేషనల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీలకు చెందిన సిబ్బంది కూడా ఢిల్లీకి రానుంది. అమెరికాకి చెందిన CIA,యూకేకి చెందిన MI-6, చైనాకి చెందిన MSS ఏజెన్సీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. తమ అధినేతలకు, ప్రతినిధులకు భద్రత కల్పించేందుకు తామే సెక్యూరిటీ ప్లాన్ సిద్ధం చేసుకున్నాయి ఈ ఏజెన్సీలు. భారత్‌కి చెందిన నిఘా వర్గాలు వారికి సాయం అందిస్తున్నాయి. ఇక ఈ సదస్సు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)తో పాటు ఆర్మీ హెలికాప్టర్లు జల్లెడ పడుతున్నాయి. యాంటీ డ్రోన్ సిస్టమ్‌ని కూడా ఏర్పాటు చేయనున్నారు.