Cricket World Cup 2023: టీమిండియా వన్డే వరల్డ్ కప్ టీమ్‌ను ఇంకా ప్రకటించలేదు.  రేపో మాపో  15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును  బీసీసీఐ వెల్లడించనుంది. ఈ 15 మంది సభ్యులలో ఎవరెవరు ఉంటారన్నది ఇదివరకే ఓ క్లారిటీ కూడా వచ్చింది.  ఆసియా కప్‌కు ఎంపికైన జట్టులోని 18 మందిలో ముగ్గురు మాత్రమే (సంజూ శాంసన్, తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణ)  ఎంపికకారని, మిగిలిన స్థానాలన్నీ ఖాయం అయ్యాయన్న వార్తలు వినపడుతున్నాయి. అయితే వీరిలోంచి తుది జట్టును ఎలా ఎంపిక చేస్తారన్న  చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.  ముఖ్యంగా వికెట్ కీపర్ విషయంలో భారత్  సందిగ్దంలో పడింది. ఈ నేపథ్యంలో  టీమిండియా మాజీ  ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  


స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో  గంభీర్ మాట్లాడుతూ.. వికెట్ కీపర్‌గా కెఎల్ రాహుల్ కంటే ఇషాన్ కిషన్‌ను తీసుకోవడమే బెటర్ అని అన్నాడు.  ఆటగాళ్ల గత పేరు కంటే  పరిస్థితులకు తగ్గట్టు ఆడగలిగే ప్లేయర్ టీమ్‌లో ఉండటం ముఖ్యమని  తెలిపాడు. 


గంభీర్ స్పందిస్తూ.. ‘వన్డే వరల్డ్ కప్‌లో కెఎల్ రాహుల్ కంటే ఇషాన్ కిషన్‌ను ఆడిస్తేనే బెటర్. ఆటగాడి ఫామ్ కంటే పేరు గొప్పది కదాదు. మీరు ఆటగాళ్ల పేర్లు చూడకండి. వాళ్ల ఆటను చూడండి.  విజయాలు తెచ్చిపెట్టే ఆటగాళ్లను ఎంపిక చేసుకోండి.  కోహ్లీ, రోహిత్‌లు వరుసగా నాలుగు అర్థసెంచరీలు చేస్తే  కెఎల్ రాహుల్ వాళ్లను రిప్లేస్ చేయగలడా..?’ అని ప్రశ్నించాడు. 






తొలినాళ్లలో వన్డేలలో తడబడిన ఇషాన్ ఇప్పుడు మెరుగయ్యాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో వన్డేలో డబుల్ సెంచరీ బాదిన ఈ జార్ఖండ్ కుర్రాడు..  వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్ ‌లో వరుసగా మూడు అర్థ సెంచరీలు సాధించాడు.  గడిచిన నాలుగు  మ్యాచ్‌లలో ఇషాన్ స్కోర్లు : 82, 77, 55, 52గా ఉన్నాయి. 


ఇక  రెండ్రోజుల క్రితం  ఆసియా కప్‌లో భాగంగా  పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చోట  ఇషాన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హార్ధిక్ పాండ్యాతో కలిసి  ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించి భారత పరువు కాపాడాడు.  పాకిస్తాన్ పేస్ త్రయం షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా,  హరీస్ రౌఫ్‌‌లతో పాటు  స్పిన్ ధ్వయం  మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్‌లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. ఇషాన్ - పాండ్యాల పోరాటంతోనే భారత్.. పాక్ ఎదుట 266 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అయితే వర్షం కారణంగా పాకిస్తాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. కాగా వన్డే వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న  కెఎల్ రాహుల్ ఇటీవలే   నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యాడు.  ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన  రాహుల్.. సూపర్ - 4 స్టేజ్‌లో  టీమ్‌తో కలవనున్నాడు. 


వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ,  శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్  పాండ్యా,  రవీంద్ర జడేజా,  శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial