Asia Cup 2023, IND Vs NEP: ఆసియా కప్‌లో  భారీ అంచనాల నడుమ  పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన భారత జట్టు వర్షం కారణంగా ఫలితం తేలని మ్యాచ్‌తో నిరాశచెందింది.  శనివారం దాయాది జట్ల మధ్య  అర్థాంతరంగా ముగిసిన కీలకపోరులో అంతరాయం కలిగించిన వర్షం.. నేడు బోణీ కొట్టి సూపర్ - 4కు ఆత్మవిశ్వాసంతో అడుగేయాలని చూస్తున్నా వరుణుడు టీమిండియా ఆశలపై నీళ్లు చల్లేట్టున్నాడు. పాక్‌తో ముగిసిన పల్లెకెలె వేదికగానే  నేపాల్‌తోనూ మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షం ముప్పు తప్పితే  భారత ఆటగాళ్లు  పసికూనలపై తమ ప్రతాపాలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. 


నేపాల్‌కు ఇదే తొలి మ్యాచ్.. 


అంతర్జాతీయ స్థాయిలో వన్డేలలో నేపాల్‌కు ఇదే తొలి మ్యాచ్.   2018లో వన్డే హోదా పొందిన నేపాల్.. ఇప్పటివరకూ అగ్రశ్రేణి క్రికెట్ జట్లతో  క్రికెట్ ఆడలేదు. ఈ టోర్నీలోనే తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆడిన నేపాల్.. ఇప్పుడు భారత్‌తో తలపడనున్నది. వర్షం లేకుండా మ్యాచ్ సజావుగా సాగితే నేపాల్‌కు   నేటి మ్యాచ్ ఒక మంచి మెమొరీగా మలుచుకునే అవకాశం లేకపోలేదు.  పాక్‌తో తొలి మ్యాచ్‌లో  238 పరుగుల తేడాతో ఓడిన  నేపాల్.. నేటి మ్యాచ్‌లో  సంచలనాలు నమోదు చేయాలన్నా వరుణుడి చేతిలోనే ఉంది. 


 






బుమ్రా లేకుండా భారత్.. 


పాక్‌తో తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత  ఆదివారం భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా  శ్రీలంకను వీడాడు. వ్యక్తిగత కారణాల రీత్యా అతడు ముంబైకి చేరుకున్నాడు. అయితే బుమ్రా ఉన్నఫళంగా ముంబై రావడం అనుమానాలకు తావిచ్చింది. అతడికి మళ్లీ గాయం తిరగబెట్టిందా..? లేక ఏమైనా  ఫిట్‌నెస్ ప్రాబ్లమ్స్ వచ్చాయా..? అన్న అనుమానాలు వెల్లువెత్తాయి. కానీ వ్యక్తిగత కారణాలతో  బుమ్రా భారత్‌కు వచ్చాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బుమ్రా భార్య సంజనా గణేషన్ గర్భవతి. ఆమె నేడు బిడ్డకు జన్మనివ్వనుంది. అందుకే బుమ్రా టీమ్‌ను హఠాత్తుగా వీడాడు. కానీ అతడు సూపర్ - 4 స్టేజ్‌లో తిరిగి  భారత్‌తో కలవనున్నాడు. 


 






ఇక  పాక్‌తో పోరులో అదరగొడతారు అనుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌లు దారుణంగా విఫలమయ్యారు. వీళ్లు  నేటి మ్యాచ్‌లో   వీరబాదుడు బాదే అవకాశాలు లేకపోలేదు.   పసలేని  నేపాల్ బౌలర్లపై  భారత బ్యాటర్లు తమ ప్రతాపాన్ని  చూపనున్నారు. బుమ్రా లేని నేపథ్యంలో  బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ తుదిజట్టులో చేరే అవకాశాలున్నాయి. ఈ ఒక్క  మార్పు తప్ప భారత తుదిజట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. 


వరుణుడు కరుణిస్తేనే.. 


పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు పదే పదే అంతరాయం కలిగించిన వర్షం..  సోమవారం కూడా అచ్చం అదే విధంగా కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం  నేడు పల్లెకెలెలో వర్షం కురిసే అవకాశాలు 80 శాతం ఉన్నాయి.  వరుణుడు కరుణిస్తేనే ఈ మ్యాచ్ సాఫీగా సాగనుంది.   


పిచ్ : పల్లెకెలె పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ  తొలి ఓవర్లలో కొద్దిసేపు  క్రీజులో ఓపికగా నిలబడితే ఇక్కడ బ్యాటింగ్ అంత కష్టమేమీ కాదని పాక్‌తో పోరులో  ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యాలు నిరూపించారు. 


తుది జట్లు (అంచనా) : 


భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా,  రవీంద్ర జడేజా,  శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ 


బంగ్లాదేశ్ :  కుశాల్ బుర్టెల్, ఆసిఫ్ షేక్, రోహిత్ పౌడెల్ (కెప్టెన్) ఆరిఫ్ షేక్, సోంపాల్ కమి, దీపేంద్ర సింగ్, గుల్సన్ ఝా, కుశాల్ మల్ల, కరణ్ కెసి, సందీప్ లమిచానె, లలిత్ రాజ్‌భన్షి 


మ్యాచ్ వేదిక, టైమింగ్స్, లైవ్ వివరాలు : 


- భారత్ - నేపాల్ మధ్య  మ్యాచ్ పల్లెకెలె (క్యాండీ) వేదికగా జరుగనుంది.  మధ్యాహ్నాం 3 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. 


- ఈ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం టెలివిజన్‌లో స్టార్ నెట్‌వర్క్ హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు స్థానిక భాషలలో కూడా అందజేస్తున్నది.  మొబైల్స్‌లో అయితే డిస్నీ హాట్ స్టార్‌లో ఎలాంటి రుసుము లేకుండానే చూడొచ్చు. 































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial