AFG Vs BAN, Match Highlights: ఆసియా కప్‌లో సూపర్ - 4 ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లా పులులు తమలోని అత్యుత్తమ ఆటను బయటకు తీశారు. తొలుత బ్యాటింగ్‌లో మెరిసిన బంగ్లాదేశ్.. తర్వాత బంతితోనూ అఫ్గాన్ పనిపట్టింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 335 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గానిస్తాన్.. 44.3 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌట్ అయింది. అఫ్గాన్ జట్టులో ఇబ్రహీం జద్రాన్ (74 బంతుల్లో 75, 10 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (60 బంతుల్లో 51, 6 ఫోర్లు) రాణించారు. బంగ్లాదేశ్.. 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ సూపర్ - 4 ఆశలు సజీవంగా ఉంచుకోగా శ్రీలంకతో జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో గెలిచి రన్ రేట్ మెరుగపరుచుకుంటేనే అఫ్గాన్‌కు తదుపరి దశకు వెళ్లడానికి అవకాశాలుంటాయి.
ఇంతవరకూ 300 ప్లస్ టార్గెట్‌ను ఛేదించని అఫ్గాన్‌కు.. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రెండో ఓవర్లోనే భారీ షాక్ తాకింది. షోరిఫుల్ ఇస్లాం వేసిన రెండో ఓవర్లో నాలుగో బంతికి రెహ్మనుల్లా గుర్బాజ్ (1)ఎల్బీగా వెనుదిరిగాడు. కానీ మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌తో జతకలిసిన రహ్మత్ షా (57 బంతుల్లో 33, 5 ఫోర్లు) అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 78 పరుగులు జోడించారు.
క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని టస్కిన్ అహ్మద్ విడదీశాడు. టస్కిన్ వేసిన 18వ ఓవర్‌లో ఐదో బంతికి రహ్మాత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రహ్మత్ నిష్క్రమించినా కెప్టెన్ హష్మతుల్లా షాహిదితో కలిసి ఇబ్రహీం.. అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు. మెహిది హసన్ వేసిన 21వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీసి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆది నుంచి అఫ్గాన్‌ను కట్టడిచేసిన బంగ్లా బౌలర్లు.. మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్ల రాకతో మరింత ఒత్తిడి పెంచారు. స్పిన్నర్లు షకిబ్, మిరాజ్‌లు అఫ్గాన్ ఆటగాళ్లను పరుగులు చేయనీయలేదు. 25 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు వంద పరుగులకు చేరింది. మెహిది హసన్ బౌలింగ్‌లో 4,6 కొట్టిన ఇబ్రహీం.. తర్వాత హసన్ మహ్మద్ వేసిన 28వ ఓవర్లో వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఇబ్రహీం నిష్క్రమించినా షాహిది నిలదొక్కుకోవడంతో అఫ్గాన్ ఆశలు పెట్టుకుంది. కానీ తర్వాత వచ్చిన బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. నజీబుల్లా జద్రాన్ (17), మహ్మద్ నబీ(3), గుల్బాదిన్ నయీబ్ (15), కరీమ్ జనత్ (1) లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఆఖర్లో రషీద్ ఖాన్.. 15 బంతుల్లో 3 బౌండరీలు, ఒక భారీ సిక్సర్ కొట్టినా అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. అఫ్గాన్.. 44.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది.
బంగ్లా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్టు తీసి అఫ్గాన్‌ను ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమయ్యారు. ఆ జట్టులో టస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా షోరిఫుల్ ఇస్లాం మూడు వికెట్లు తీశాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 334 పరుగులు చేసింది. మెహిది హసన్ మిరాజ్ (112), నజ్ముల్ శాంతో (104)లతో పాటు చివర్లో కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (32 నాటౌట్) రాణించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial