BAN vs AFG, Asia Cup 2023:  ఆసియా కప్‌లో సూపర్ - 4 కు క్వాలిఫై కావాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోరుపై కన్నేసింది. అఫ్గానిస్తాన్‌తో లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో గ్రూప్ మ్యాచ్‌లో ఆ జట్టు నిలకడగా ఆడుతోంది.  ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయినా  తిరిగి కోలుకుంది.  ఓపెనర్ మెహిది హన్ మిరాజ్ (91 బంతుల్లో 75 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్సర్), నజ్ముల్ హోసేన్ శాంటో (61 బంతుల్లో 54 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్సర్) లు అర్థ సెంచరీలు పూర్తిచేసి బంగ్లాను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నారు. 31 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్.. 2  వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 


గడాఫీ  స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్  తొలుత బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఓపెనర్లుగా మహ్మద్ నయీమ్ (32 బంతుల్లో 28, 5 ఫోర్లు), మెహిది హసన్‌లు తొలి వికెట్‌కు 9.6 ఓవర్లలో 60 పరుగులు జోడించారు.  తొలి నుంచే దూకుడుగా ఆడిన ఈ ఇద్దరూ..  తొలి ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టారు. 


బ్రేక్ ఇచ్చిన ముజీబ్.. 


అర్థ సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసి ధాటిగా ఆడుతున్న ఈ జోడీని  అఫ్గాన్ యువ స్పిన్నర్  ముజీబ్ ఉర్ రెహ్మాన్ విడదీశాడు. ముజీబ్ వేసిన పదో ఓవర్  ఆఖరు బంతికి  నయీమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని అంచనా వేయడంలో  నయీమ్ లెక్క తప్పింది.   కానీ బంతి మాత్రం వికెట్లను గిరాటేసింది. దీంతో ఓపెనింగ్  జోడీకి తెరపడింది.  వన్ డౌన్ ‌లో క్రీజులోకి వచ్చిన తౌహిద్ హృదయ్ మరోసారి నిరాశపరిచాడు.  రెండు బంతులే ఆడిన హృదయ్.. గుల్బాదిన్ వేసిన 11వ ఓవర్లో మూడో బంతికి  స్లిప్స్‌లో ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.  


శాంటో రాకతో.. 


63 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయిన బంగ్లా ఇన్నింగ్స్‌ను  హసన్‌తో కలిసి శాంటో పునర్నిర్మించాడు.  ఈ ఇద్దరూ  అఫ్గాన్ స్పిన్ ధ్వయం  రసీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లను ధీటుగా ఎదుర్కున్నారు.  ఇద్దరూ క్రీజులో కుదురుకున్నాక  స్కోరు వేగం కూడా  పెరిగింది. నబీ వేసిన 24వ ఓవర్లో   మిరాజ్ సింగిల్ తీసి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత మిరాజ్, శాంటోలు కరీమ్ జనత్ బౌలింగ్‌లో తలా ఓ ఫోర్ కొట్టి  బంగ్లా స్కోరును 150 పరుగులు దాటించారు. నబీ వేసిన  30వ ఓవర్ల మిరాజ్ ఓ బౌండరీ బాదాడు.  ఇదే ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీయడంతో ఈ ఇద్దరి  భాగస్వామ్యం వంద పరుగులు పూర్తైంది. 30వ ఓవర్ వేసిన ఫరూఖీ వేసిన  రెండో బాల్‌ను  డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ కొట్టిన శాంటో  ఈ టోర్నీలో రెండో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 


 






ఈ మ్యాచ్‌కు తుది జట్లు : 


అఫ్గానిస్తాన్ : రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా  షాహిది (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నయీబ్, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ ఫరూఖీ 


బంగ్లాదేశ్ : మహ్మద్ నయీం, నజ్ముల్ హోసెన్ శాంటో, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్, శామిమ్ హోసేన్, ముష్ఫీకర్ రహీమ్, అఫిఫ్ హోసెన్, మెహిది హసన్, టస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, షోరిఫుల్ ఇస్లాం 




























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial