Centre Vs Twitter:
కేంద్రం వర్సెస్ ట్విటర్
కేంద్ర ప్రభుత్వానికి, ట్విటర్‌కి మధ్య గొడవ ఇంకా సద్దుమణగలేదు. ఇండియన్ ఐటీ రూల్స్ ప్రకారమే ట్విటర్ నడుచుకోవాలని తేల్చి చెబుతోంది కేంద్రం. ఈ విషయంలో ట్విటర్ వెనక్కి తగ్గడం లేదు. ఉద్దేశపూర్వకంగా తమని టార్గెట్ చేస్తున్నారని వాదిస్తోంది. అభ్యంతరకరంగా ఉన్న వేలాది ట్వీట్‌లను గుర్తించిన కేంద్రం..వాటిని వెంటనే తొలగించాలని ట్విటర్‌ని ఆదేశించింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తోంది ట్విటర్. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కి నోటీసులు ఇచ్చింది. "ఆ ట్వీట్‌లను తొలగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్" అని హెచ్చరించింది. ఇదే విషయాన్ని కేంద్రం వెల్లడించింది. 2020-21 మధ్య కాలంలో రైతుల ఉద్యమం జరిగింది. ఆ సమయంలో కొన్ని అభ్యంతరకర వీడియోలు, పోస్ట్‌లు ట్విటర్‌లో వెల్లువెత్తాయి. మొత్తంగా 3,750 URLలను గుర్తించింది కేంద్రం. వాటిలో 167 ట్వీట్‌లను వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. కానీ ట్విటర్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. అందుకే...నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ట్విటర్ ఆఫీస్‌ని కావాలనే మూయించారన్న ఆరోపణలను ఖండించింది. Information Technology Act ఆధారంగా వాటిని బ్లాక్ చేయాలని చెప్పినట్టు వివరించింది.
"గతేడాది జూన్ 27న ట్విటర్‌కి కేంద్ర ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఐటీ యాక్ట్ 2000 కింద అభ్యంతరకర వీడియోలు, URLలు తొలగించాలని తేల్చి చెప్పింది. వాటిని తొలగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది"
- రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ మంత్రి
కర్ణాటక హైకోర్టులో పోరాటం..
కేంద్ర ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్న ట్విటర్ పిటిషన్‌ని కొట్టేసిన కోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. "మా వాదనను కోర్టు సమర్థించింది. ట్విటర్ ఇక్కడి రూల్స్‌ని పాటించాల్సిందే" అని స్పష్టం చేశారు. గతేడాది ఐటీ యాక్ట్‌లో సంస్కరణలు చేసిన కేంద్రం...Section 69A ప్రకారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఫిబ్రవరి 2021 నుంచి 2022 ఫిబ్రవరి మధ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవాస్తవాలు ప్రచారం చేసిన అకౌంట్‌లు, ట్వీట్‌లను బ్లాక్ చేయాలని ట్విటర్‌ని ఆదేశించింది. దాదాపు 39 లిస్ట్ చేసి వాటిని బ్లాక్ చేయాలని తేల్చి చెప్పింది. దీనిపై ట్విటర్ అసహనం వ్యక్తం చేసింది. ఇది తమ రూల్స్‌కి వ్యతిరేకమని వెల్లడించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేసింది. న్యాయపోరాటానికి సిద్ధమైంది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం తమపై ఆంక్షలు విధించడాన్ని ట్విటర్ వ్యతిరేకించింది.గతేడాది కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. "బ్లాక్ చేయాలని చెబుతున్నారు సరే..వాటికి కారణాలూ చెప్పాలిగా" అని ట్విటర్ వాదించింది. అయితే...కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రూల్స్‌కి కట్టుబడి ఉండకుండా ట్విటర్ నిబంధనలు ఉల్లంఘిస్తోందని కోర్టుకి వివరించింది.ఈ ఆర్డర్ పాస్ చేసే ముందు ట్విటర్ ప్రతినిధులతో మాట్లాడమని వెల్లడించింది. కానీ ట్విటర్ మాత్రం కేంద్రంపై యుద్ధం చేస్తూనే ఉంది.