CAATSA India: భారత్- రష్యా మధ్య ఉన్న బలమైన సంబంధాలు, మైత్రిపై ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ఎక్కువగానే ఉంది. రష్యా మైత్రి కారణంగానే ఈ విషయంలో భారత్ తటస్థంగా ఉన్నట్లు ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.


అమెరికాతో సహా నాటో దేశాలు.. భారత్ ఓ స్పష్టమైన వైఖరి చెప్పాలని ఒత్తిడి తెస్తున్నాయి. కానీ భారత్ మాత్రం.. శాంతియుతంగా చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని పాత మంత్రాన్నే జపిస్తోంది. దీంతో భారత్‌పై 'కాట్సా' అస్త్రాన్ని ప్రయోగించేందుకు బైడెన్ సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అసలేంటి ఈ కాట్సా? ప్రయోగిస్తే మనకేంటి? 


కాట్సా అంటే?


కౌంటరింగ్‌ అమెరికా యాడ్వర్సరీస్‌ థ్రూ శాంక్షన్స్‌ యాక్ట్‌ను సింపుల్‌గా కాట్సా అంటారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఏదైనా దేశం ఇతర దేశాల నుంచి ఆయుధ సంపత్తిని సముపార్జించుకుంటే అగ్రరాజ్యం ఈ కాట్సాను ప్రయోగిస్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే అమెరికా తన ప్రత్యర్థుల్ని నిరోధించే చట్టమే ఈ కాట్సా. అయితే ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఈ అస్త్రాన్ని మనపై ప్రయోగించేందుకు అమెరికా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోందని సమాచారం. 


ఎందుకు?


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుండటం వల్ల ఆ దేశంపై పలు ఆంక్షలు విధిస్తోంది అమెరికా. అంతటితో ఆగకుండా దాని సన్నిహిత దేశాలపై పలు ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. రష్యా నుంచి ఎస్‌–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తోన్న భారత్‌పై కూడా ఈ ఆంక్షలు పడే అవకాశం ఉంది. కాట్సా ఆంక్షలను కీలక భాగస్వామిగా ఉన్న భారత్‌పై వర్తింప జేసే విషయంలో అధ్యక్షుడు బైడెన్‌దే తుది నిర్ణయమని అమెరికా ఉన్నతాధికారి ఒకరు గురువారం తెలిపారు.


ముందు కూడా


అయితే భారత్‌పై కాట్సా ప్రయోగిస్తామని అమెరికా బెదిరించడం ఇది తొలిసారి కాదు. ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను రష్యా నుంచి మన దేశం కొనుగోలు చేస్తుందని తెలిసినప్పుడే అమెరికా ఈ హెచ్చరికలు చేసింది. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా నుంచి ఈ ఆయుధ సంపత్తిని సముపార్జించుకుంటుండటంపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. 


ఎస్‌-400ను కొనుగోలు చేసిన కారణంగా చైనా, టర్కీ (ఇది నాటో భాగస్వామి)లపై ఇప్పటికే కాట్సాను ప్రయోగించింది అమెరికా. మరి భారత్‌తో బలమైన మైత్రిని కాదని అమెరికా ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తుందా? లేక మరోసారి భారత్‌కు మినహాయింపు ఇస్తుందా అనేది పూర్తి బైడెన్ చేతిలోనే ఉంది. కానీ ఏది ఏమైనా ఉక్రెయిన్- రష్యా యుద్ధం భారత్‌ను ఇరకాటంలో పడేసిందనేది మాత్రం నిజమని విశ్లేషకులు అంటున్నారు.


ఎస్-400


ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్‌-400 ట్రయంఫ్‌ ఒకటి. డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లతో పాటు యుద్ధ విమానాల దాడుల నుంచి అది రక్షణ కల్పిస్తుంది. తనవైపు దూసుకొచ్చే శత్రు దేశాల ఆయుధాలను క్షిపణుల ప్రయోగంతో కూల్చివేస్తుంది. ప్రధానంగా చైనా, పాకిస్థాన్‌లతో పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణ ఛత్రంగా పని చేస్తుందన్న ఉద్దేశంతో భారత్‌ దీని కొనుగోలుకు నిర్ణయించింది. అయిదు ఎస్‌-400 వ్యవస్థల సముపార్జన కోసం 2018 అక్టోబరులో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.


Also Read: Mosque Blast in Peshawar: మసీదు వద్ద భారీ పేలుడు- 30 మంది మృతి, 50 మందికి గాయాలు


Also Read: Russia Ukraine War: ఇది కనుక పేలితే ఐరోపా అంతమే- దాని కన్నా 10 రెట్లు ఎక్కువ : జెలెన్‌స్కీ