పాకిస్థాన్‌లో పెషావర్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 56 మంది మృతి చెందారు, 50 మందికి పైగా గాయాలైనట్లు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 









పెషావర్‌లోని షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతోన్న వేళ ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడుకు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.





దర్యాప్తు


పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్‌లో ఉన్న జామియా మసీదే లక్ష్యంగా ఈ పేలుడు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతోన్న సమయంలోనే పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి చేసినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.


ముందుగా ఇద్దరు దుండగులు.. తుపాకీలతో మాస్కులోకి ప్రవేశించేందుకు యత్నించారని పోలీసులు వెల్లడించారు. కాపాలాగా ఉన్న పోలీసుపై కాల్పులు చేయగా అధికారి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత పేలుడు జరిగిందన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.


వరుస దాడులు


పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు కొత్తేం కాదు. ముఖ్యంగా మసీదులు, జనాలు ఎక్కువగా ఉండే మార్కెట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పాకిస్థాన్‌లోనే కాకుండా భారత్ సహా ప్రపంచదేశాల్లో పలు ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతోన్న ఉగ్రవాదులకు నివాసంగా పాకిస్థాన్ తయారైందని ఐరాసలో పలుసార్లు భారత్ స్పష్టం చేసింది.


గ్రే లిస్ట్‌లోనే


మరోవైపు పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలేలా ఉంది. ప్రపంచ మనీలాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ నిఘా సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్)​ పాకిస్థాన్‌ను జూన్‌ వరకు గ్రే జాబితాలోనే కొనసాగించనున్నట్లు సమాచారం. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోనందుకే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికసాయం అందకుండా చర్యలు తీసుకోవటంలో విఫలమైనందున 2018 జూన్‌ నుంచి పాకిస్థాన్‌ ఎఫ్​ఏటీఎఫ్ గ్రే జాబితాలో కొనసాగుతోంది. 


Also Read: CAATSA India: భారత్‌ మెడపై 'కాట్సా' కత్తి- బైడెన్ కోర్టులో బంతి, మోదీ ఏం చేస్తారో మరి!


Also Read: Russia Ukraine War: ఇది కనుక పేలితే ఐరోపా అంతమే- దాని కన్నా 10 రెట్లు ఎక్కువ : జెలెన్‌స్కీ