Budget 2022 Telugu, Union Budget 2022:  కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు మరికొన్ని రోజులే ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడతారు? ఎప్పుడు ప్రవేశపెడతారు? ఇంతకు ముందు ఎలా ఉండేది? బడ్జెట్‌లో ఏముంటాయి? అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. త్వరలో ప్రవేశపెట్టే Budget 2022పై తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీ కోసం!!


What is a Union Budget / కేంద్ర బడ్జెట్‌ అంటే ఏంటి?


ఏడాదికి ఒకసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఆర్థిక బిల్లుల్లో భాగంగా పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ఈ వార్షిక ఆర్థిక స్టేట్‌మెంట్లో రానున్న ఆర్థిక ఏడాదిలో వచ్చే రాబడి, చేయబోయే ఖర్చులపై అంచనాలు ఉంటాయి. భారత రాజ్యాంగంలోని 112వ ఆర్టికల్‌ ప్రకారం దీనిని రూపొందిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది.


When is Budget 2022 and who will present it / కేంద్ర బడ్జెట్‌ 2022ను ఎవరు, ఎప్పుడు ప్రవేశపెడతారు?


కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ఏటా ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడతారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. 2016కు ముందు వరకు కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి ఆఖరి పనిదినంలో ప్రవేశపెట్టేవారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ సంప్రదాయాన్ని మార్చారు. 1999కు ముందైతే సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టేవారు. బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ సమయం ప్రకారమే నడుచుకునేవారు.


What are the two components of the Budget / కేంద్ర బడ్జెట్‌లో ఉండే రెండు అంశాలేంటి?


బడ్జెట్‌ను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి రెవెన్యూ బడ్జెట్‌, రెండోది క్యాపిటల్‌ బడ్జెట్‌. రెవెన్యూ బడ్జెట్‌లో ఆదాయం, ఖర్చులు ఉంటాయి. ఇక ఈ ఆదాయమూ పన్ను, పన్నేతర రాబడిగా ఉంటుంది. ప్రభుత్వం నడిపేందుకు రోజువారీ ఖర్చులు, ప్రజలకు సేవలకు అవసరమయ్యే ఖర్చులు రెవెన్యూ ఖర్చుల్లో ఉంటాయి. క్యాపిటల్‌ బడ్జెట్‌లో పెట్టుబడి ద్వారా, చెల్లింపుల ద్వారా రాబడి ఉంటాయి. ప్రజలు, ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులూ ఉంటాయి. యంత్రాలు, పనిముట్లు, నిర్మాణాలు, వైద్య, ఆరోగ్య వసతులు, విద్య వంటివి క్యాపిటల్ ఖర్చుల్లో ఉంటాయి.


What is fiscal deficit / ఆర్థిక లోటు అంటే ఏంటి?


మొత్తం రాబడిని మించి ఖర్చులు ఉంటే ఆర్థిక లోటుగా చెబుతారు. ఇక రెవెన్యూ రాబడిని మించి రెవెన్యూ ఖర్చులుంటే రెవెన్యూ లోటు అంటారు. రోజువారీ కార్యక్రమాలు నడిపేందుకు సరైన నగదు లేనప్పుడు రెవెన్యూ లోటు కనిపిస్తుంది. అభివృద్ధి, ధరల స్థిరత్వం, ఉత్పత్తి ఖర్చు, ద్రవ్యోల్బణాలను బట్టి ఆర్థికలోటు ఉంటుంది.


Also Read: Budget 2022: ప్రభుత్వ బడ్జెట్‌ ఇన్ని రకాలా? ఇండియాలో ఏది అమలు చేస్తారో తెలుసా?