Budget 2022 Telugu, Union Budget 2022: ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నా, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా, ప్రజా సంక్షేమ పథకాలకు డబ్బులు కేటాయించాలన్నా ఏటా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం తప్పనిసరి! పార్లమెంటులో ఆర్థిక బిల్లులను ఆమోదించకపోతే ప్రభుత్వం డబ్బులను ఖర్చుపెట్టేందుకు వీలుండదు.


ఇక ప్రభుత్వ ఖజానాకు వస్తున్న రాబడి ఎంత? ఖర్చు చేస్తున్నది ఎంత? అని తెలియాలన్నా బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిందే. ఎంతోమంది అంకెల గారడీ అనుకుంటారు కానీ బడ్జెట్‌కు ఉండే ప్రాముఖ్యమే వేరు! చాలామందికి తెలియని మరో విషయం ఏంటంటే..  సంతులన (బ్యాలన్స్‌డ్‌), మిగులు, లోటు అని బడ్జెట్‌ మూడు రకాలు.


సంతులన బడ్జెట్‌


ఒక ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ రాబడి, ఖర్చుల అంచనాలు సమానంగా ఉంటే బ్యాలన్స్‌డ్ బడ్జెట్‌ అంటారు. సాధారణంగా ఇలాంటి బడ్జెట్‌ను ఆర్థివేత్తలు అర్థవంతమైనదిగా భావిస్తుంటారు. రాబడిని మించి ప్రభుత్వ ఖర్చు ఉండొద్దని వారు నమ్ముతుంటారు. అయితే మహా మాంద్యం వంటి సమయాల్లో ఇలాంటి బడ్జెట్‌ ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణను తీసుకురాలేదని మరికొందరి అభిప్రాయం. చెప్పడానికి రాబడి, ఖర్చులు సమానంగా ఉండాలన్నది బాగున్నా అమలు చేయడం మాత్రం చాలా కష్టం. నిరుద్యోగ సమస్యను ఇది పరిష్కరించలేదు. ఆర్థిక వృద్ధి సాధించడం కష్టం. ప్రజా సంక్షేమానికి డబ్బు ఖర్చు చేయలేరు.


మిగులు బడ్జెట్‌


ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభత్వ రాబడి అంచనాలు ఖర్చులను మించి ఉండే దానిని మిగులు బడ్జెట్‌ అంటారు. అంటే పన్నులు, సుంకాల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంటుంది. ప్రజా సంక్షేమానికి తక్కువగా ఖర్చు చేస్తారు. మిగులు బడ్జెట్‌ ఉందంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తున్నట్టు లెక్క! ద్రవ్యోల్బణం సమసంలో డిమాండ్‌ను తగ్గించేందుకు మిగులు బడ్జెట్‌ను అమలు చేస్తుంటారు.


లోటు బడ్జెట్‌


ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రాబడిని మించి ఖర్చులు ఉంటే దానిని లోటు బడ్జెట్‌ అంటారు. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు లోటు బడ్జెట్‌ నప్పుతుంది. ప్రతి ద్రవ్యోల్బణం సమయంలో లోటు బడ్జెట్‌ ఉపయోగపడుతుంది. అదనపు డిమాండ్‌ను పెంచి ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించొచ్చు. ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయొచ్చు. ఫలితంగా వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. బాండ్ల వంటివి జారీ చేయడం,  అప్పులు చేయడం, రిజర్వుల నుంచి డబ్బు తీసుకోవడం ద్వారా ఈ బడ్జెట్‌ను అమలు చేయొచ్చు. ఇలాంటి బడ్జెట్‌ వల్ల అప్పుల భారం పెరిగే అవకాశం ఎక్కువ.