ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. చిన్నపాటి మనస్పర్థలకే విడిపోవడాలు కాస్త ఎక్కువయ్యాయి. వ్యక్తిగత స్వేచ్ఛ దొరకడం లేదనుకోవడం, భర్త లేదా భార్య ఏదైనా అంటే తేలిగ్గా తీసుకోలేకపోవడం వంటి కారణాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటున్నాయి. కొన్నిసార్లు భాగస్వామి చేసే పనులు లేదా అలవాట్లు కూడా నచ్చకపోవడం విడాకులు తీసుకునేందుకు కారణాలు అవుతున్నాయి. తాజాగా ఓ భార్యకు ఉన్న అలవాటు.. భర్త విడాకులు డిమాండ్ చేసేందుకు దారి తీసింది.


తన భార్య రోజుకు ఆరుసార్లు స్నానం చేస్తోందని భర్త విడాకుల కోసం పోలీసులను వేడుకున్నాడు. అంతేకాక, ఇంట్లో అతి శుభ్రత పాటిస్తున్న భార్య ప్రవర్తన తనకు రోజూ విసుగు తెప్పిస్తుందని ఆరోపించాడు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఇలా పోలీసులను ఆశ్రయించాడు. ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని కోరాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌లో ఉంటున్న ఈ భార్యాభర్తలకు 2009లో వివాహం జరిగింది. బెంగళూరు రాకముందు ఉద్యోగ రీత్యా కొంతకాలం లండన్‌లో ఉండేవారు. 


అంతకుముందు నుంచి అతి శుభ్రత వ్యాధి ఉన్నా.. ఇండియాకు వచ్చాక అది మరింతగా పెరిగింది. మొదటి కాన్పు తర్వాత అతి శుభ్రత జబ్బు మరింత అధికం అయింది. భర్తను బూట్లు, బట్టలు, మొబైల్ ఫోన్లు తరచూ శుభ్రం చేయాలని కోరుతూ ఉండేది. ఇది వ్యాధి అని గుర్తించి.. డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లగా ఆమె.. ఓసీడీ (అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌) అనే మానసిక వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు తేలింది. వైద్యుడు కౌన్సెలింగ్‌ ఇచ్చిన తర్వాత కొద్దిలో కొద్ది మార్పు కనిపించింది. 


కొన్నేళ్లకు రెండో ప్రసవం జరిగాక ఓసీడీ మళ్లీ మొదటికి వచ్చింది. గత లాక్ డౌన్ సమయంలో భర్త వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న సమయంలో అతని ల్యాప్‌ టాప్‌, ఫోన్లను ఏకంగా సబ్బులతో శుభ్రం చేసేది. చివరికి ఇంట్లో అందరూ స్నానాలు చేశాక.. వారు వాడిన సబ్బును కూడా వదిలేది కాదు. ఆ సబ్బును కూడా కడిగేది. ఒంటిపై కూడా అతి శుభ్రత ఉండడంతో రోజుకు ఆరు సార్లు స్నానం చేసేది. ఆమె ప్రవర్తనతో సహనం కోల్పోయిన భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరు పోలీసులు ఈ కేసును మహిళా హెల్ప్‌లైన్‌ కేంద్రానికి బదిలీ చేశారు.


Also Read: దేశంలో నాలుగో ఒమిక్రాన్ కేసు... మహారాష్ట్రలో తొలి కేసు... దక్షిణాఫ్రికా నుంచి ముంబయి వచ్చిన వ్యక్తికి పాజిటివ్


Also Read:  దేశంలో మూడో ఒమిక్రాన్ కేసు... జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్ లక్షణాలు


Also Read:  ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి