భారత్ లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో మూడో ఒమిక్రాన్ కేసు రాగా, మహారాష్ట్రలో తాజాగా నాలుగో కరోనా కేసు నమోదయ్యింది. మహారాష్ట్రలోని ముంబయికి చెందిన 33 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆ వ్యక్తి గత నెల దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌, దిల్లీ మీదుగా ముంబయి వచ్చినట్లు తెలుస్తోంది. కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు వెల్లడించింది. అతను ఇప్పటి వరకూ ఎలాంటి కోవిడ్‌ వ్యాక్సి్న్ తీసుకోలేదని వైద్యులు తెలిపారు. నవంబర్ 24న ముంబయి వచ్చిన అతడికి ఇటీవల జ్వరం వచ్చింది. దీంతో కరోనా పరీక్షలు చేయగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు గుర్తించారు. అతడి ప్రైమరీ కాంటాక్ట్స్ కు పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ కేసుతో దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకగా, శనివారం గుజరాత్‌ జామ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. 






Also Read:  దేశంలో మూడో ఒమిక్రాన్ కేసు... జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్ లక్షణాలు


గుజరాత్ లోనూ ఒమిక్రాన్ కేసు


భారత్ ను కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. తాజాగా గుజరాత్ లో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. గుజరాత్‌ జామ్‌నగర్‌లో ఓ వ్యక్తిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఇటీవల జింబాబ్వే నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ గుర్తించినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్స్ వివరాలు సేకరిస్తున్నారు. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చిన కొందరి ఆచూకీ అధికారులకు చిక్కకపోవడం సమస్యగా మారింది. వారు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Also Read:  ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి