జవాద్ తుపాను విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 210 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే ఆరు గంటల్లో క్రమంగా బలహీనపడి ఆదివారం మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా మారి ఒడిశా పూరీ వద్ద తీరం దాటనుందని IMD ప్రకటించింది. తుపాను మరింత బలహీనపడి ఒడిశా తీరం వెంబడి పశ్చిమ బెంగాల్ తీరం వైపు ఉత్తర-ఈశాన్య దిశగా కొనసాగుతుందని తెలుస్తోంది. 






తీరం వెంబడి అలెర్ట్


ఒడిశా తీర ప్రాంతంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. వాతావరణశాఖ సమాచారం ప్రకారం గత 12 గంటల్లో పారాదీప్‌లో గరిష్టంగా 68 మి.మీ, భువనేశ్వర్ లో 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరప్రాంత జిల్లాల్లో నిన్న సాయంత్రం నుంచి మేఘాలు కమ్ముకుని వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహపాత్ర తెలిపారు.  ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా ఒడిశాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షపాతం తీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశాలోని గజపతి, గంజాం, పూరీ, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలకు రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు శనివారం రెడ్ అలెర్ట్ హెచ్చరిక జారీ చేసింది.  తీరం వెంబడి గంటకు 75 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ భువనేశ్వర్ డైరెక్టర్ హెచ్ఆర్ బిస్వాస్ తెలిపారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. తీరం వెంబడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. 


Also Read: దిశను మార్చుకున్న జవాద్ తుపాన్.. బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం


ఏపీ, ఒడిశాపై తుపాను ప్రభావం


కటక్ జిల్లాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపరా, నియాలీ ప్రాంతాల్లోని నివసించే ప్రజలను శనివారం ఖాళీ చేయవలసిందిగా జిల్లా అధికారులు సూచించారు. దాదాపు 22,700 ఫిషింగ్ బోట్లు ఇప్పటికే సముద్రం, చిలికా సరస్సు నుంచి తీరానికి చేరుకున్నాయని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (SRC) పీకే జెనా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ బి లఠ్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొన్ని చోట్ల 50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని అన్నారు. శుక్రవారం నుంచి 79 తుపాను షెల్టర్లను ఏర్పాటుచేశామన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్), అగ్నిమాపక బృందాలను జిల్లా అంతటా మోహరించామన్నారు.


Also Read: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు


పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాలు


శని, ఆదివారాల్లో పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఆది, సోమవారాల్లో అస్సాం, మేఘాలయ, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దక్షిణ 24 పరగణాలు, పుర్బా మేదినీపూర్ జిల్లాల్లో ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సముద్ర రిసార్ట్‌లలోని పర్యాటకులను బీచ్‌లకు దూరంగా ఉండాలని కోరింది. మహానగరం, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా, పశ్చిమ్ మెదినీపూర్, ఝర్‌గ్రామ్, హౌరా, హుగ్లీ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుసింది.  దక్షిణ 24 పరగణాలు పుర్బా మేదినీపూర్ జిల్లాల్లో దాదాపు 11,000 మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 19 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి.


Also Read: అన్నమయ్య ప్రాజెక్ట్ ఘటనపై రచ్చ ! విచారణకు టీడీపీ డిమాండ్..దిగజారుడు రాజకీయమన్న వైఎస్ఆర్‌సీపీ !


64 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు


ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో మోహరించామని  ఎన్‌డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. 64 బృందాలు పశ్చిమ బెంగాల్‌లో, 52 బృందాలు ఏపీ, ఒడిశాలో మోహరించామని డీజీ తెలిపారు.


Also Read: ఉత్తరాంధ్రపై అధికారుల స్పెషల్ ఫోకస్.. ప్రాణ నష్టం ఉండకూడదన్న సీఎం జగన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి