Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir)లో రామ్‌లల్లా (Ram Lalla) ప్రాణ ప్రతిష్ట ఏర్పాట్లు వైభవంగా సాగుతున్నాయి. దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రామ మందిర(Ramalayam) ప్రారంభోత్సవానికి రెండు రోజులు మాత్రమే మాత్రమే మిగిలి ఉంది. జనవరి 22 సోమవారం బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Modi)తో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలిరానున్నారు. 


లైవ్‌లో చూసే అవకాశం
ప్రాణప్రతిష్ట మహాక్రతువును ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. మరికొందరు టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న టీవీ ఛానెళ్లు లైవ్ ఈ మహత్తర కార్యక్రమాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థలు పీవీఆర్‌(PVR), ఐనాక్స్‌(INOX)లు అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకలను పెద్ద స్క్రీన్లపై చూసే అవకాశం కల్పిస్తున్నాయి. రూ.100 టికెట్‌తోనే థియేటర్లలో కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. 


170 స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారం
గతంలో పీవీఆర్‌, ఐనాక్స్‌లు వన్డే ప్రపంచ కప్‌ మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అదే తరహాలో ఇప్పుడు అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడులకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దేశవ్యాప్తంగా 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేసేలా పీవీఆర్‌, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. జనవరి 22వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ మహాక్రతువును బిగ్ స్క్రీన్‌పై చూడొచ్చు. అయితే ఇందుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇందులో కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్ ఉచితంగా అందిస్తున్నారు. ఆయా మల్టీప్లెక్స్‌ల అధికారిక వెబ్‌ సైట్, బుక్‌ మై షోలోనూ అయోధ్య రాముడి పండగ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. పీవీఆర్ ఐనాక్స్ కో-సీఈవో గౌతం దత్తా మాట్లాడుతూ.. ‘ఇదొక చారిత్రక ఘట్టం. అందుకే పెద్ద తెరపై చూసేందుకు అయోధ్య రాముడి ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు.


సినీ ప్రముఖులకు ఆహ్వానం
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలకు ప్రపంచ నలుమూలలోని ప్రముఖులకు ఆహ్వానం అందింది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ దంపతులు, మోహన్‌ బాబు, ప్రభాస్, అలాగే ఇతర పరిశ్రమల నుంచి రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, రిషబ్ శెట్టి, యష్, కంగనా రనౌత్, అలియా భట్ తదితర ప్రముఖులు అయోధ్య రాముడి వేడుకలో ప్రత్యక్షంగా భాగం కానున్నారు. కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తుంది. 


121 మందితో ప్రాణ ప్రతిష్ట
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ ఆధ్వర్యంలో 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారని కమిటీ వెళ్లడించింది. ఈ కార్యక్రమాలకు కాశీకి చెందిన లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరించబోతున్నారు.