ప్రపంచస్థాయి క్రీడలకు భారత్‌ను కేంద్ర బిందువు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ప్రధాని మోడీ(PM Narendra Modi) అన్నారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని, క్రీడాకారులకు అంతర్జాతీయ గుర్తింపును అందించాలని.. భారత్‌ను ప్రపంచ క్రీడా కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. భారత్ ప్రపంచ క్రీడా కేంద్రంగా మారే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఖేలో ఇండియా యువజన (Khelo India Youth Games) క్రీడల్ని చెన్నై(Chennai)లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆయన ప్రారంభించారు. ఇదే వేదిక నుంచి రూ.250కోట్ల విలువైన రేడియో, టీవీ ప్రసారాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్‌రవి(R N Ravi), ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్(Stalin)పాల్గొన్నారు. అనంతరం దేశనలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఓ లక్ష్యంతో ముందుకు....
యూపీఏ హయాంలో క్రీడలకు సంబంధించిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను ప్రస్తావిస్తూ గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం క్రీడల్లో అక్రమ ఆటలకు స్వస్తి పలికిందని అన్నారు. 2014 తర్వాత తమ ప్రభుత్వ హయాంలో చేసిన కృషి వల్ల భారత అథ్లెట్లు ప్రదర్శన మెరుగైందని మోదీ అన్నారు. టోక్యో, పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన చేశారని... ఆసియా గేమ్స్, ఆసియా పారా గేమ్స్‌లో చరిత్ర సృష్టించారని మోదీ గుర్తు చేశారు. 2029లో యూత్ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్స్ పోటీల్ని భారత్‌లో నిర్వహించేందుకు ఎంతో పట్టుదలతో ఉన్నట్లు వివరించారు. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో ఎక్కువ పతకాలు సాధించే లక్ష్యంతో సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు.
దశాబ్దకాలంలో క్రీడల్లో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. బీచ్‌గేమ్స్, క్రీడా పర్యాటక అధ్యాయం భారత్‌లో మొదలైందని, తీర ప్రాంతాలకు ఎంతో మేలుచేసేలా ప్రణాళికలు చేశామని వెల్లడించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అయితే గత 10 ఏళ్లలో భారత అథ్లెట్లలో ఆత్మవిశ్వాసం, అడుగడుగునా ప్రభుత్వ సహకారం లభించిందని మోడీ అన్నారు. తమిళనాడుకు చెందిన చాలా మంది క్రీడాకారులు క్రీడల్లో అద్భుతాలు' చేస్తున్నారని ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు.
క్రీడలకు అధిక ప్రాధాన్యం
రానున్న మూడేళ్లలో భారత్‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామని, ఇందులో క్రీడలకు చక్కటి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 31 వరకు తమిళనాడులోని చెన్నై, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు వేదికలుగా జరిగే ఖేలో ఇండియా యువజన క్రీడల్లో 5,630 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఖేలో ఇండియా పేద, ఆదివాసీ, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత కలలను సాకారం చేస్తోందని మోడీ అన్నారు. లోకల్ టు వోకల్ నినాదంలో క్రీడా ప్రతిభ కూడా ఉంటుందన్నారు. బీచ్ గేమ్స్, స్పోర్ట్స్ టూరిజం కోసం కొత్త అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ క్రీడా పరిశ్రమ దాదాపు లక్ష కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఒక అంచనా ఉందని వెల్లడించారు.