Anti Polygamy:
హిమంత క్లారిటీ..
అసోం ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. బహు భార్యత్వం (Polygamy)పై రాష్ట్రంలో నిషేధం విధించనుంది. త్వరలోనే ఇందుకు సంబంధిచిన బిల్‌ని ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్ ప్రస్తావన తీసుకొచ్చేందుకు సీఎం హిమంత బిశ్వ శర్మ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ సమావేశాల్లో బిల్‌ని ప్రవేశపెట్టడం కుదరకపోతే...వచ్చే ఏడాది జనవరిలో జరిగే సెషన్‌లో తప్పకుండా తీసుకొస్తామని స్పష్టం చేశారు. యునిఫామ్ సివిల్ కోడ్(UCC) లో యాంటీ పాలిగమీ ( anti-polygamy bill) అనేది ఓ భాగం అని తేల్చి చెప్పారు.
"యునిఫామ్ సివిల్ కోడ్ అనేది పార్లమెంట్ పరిధిలోని విషయం. అక్కడే దానిపై నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదంతో అమలు చేసుకోవచ్చు. ఇది కూడా UCCలో భాగమే. అసోంలో బహు భార్యత్వంపై నిషేధం విధించాలని నిర్ణయించుకున్నాం"
- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి
యూసీసీలోని అంశాలను పార్లమెంటరీ కమిటీతో పాటు లా కమిషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని అన్నారు హిమంత. నిజానికి ఈ ఏడాది మే నెలలోనే యాంటీ పాలిగమీకి సంబంధించిన లీగాలిటీపై చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని కూడా నియమించింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ ప్యానెల్‌కి గువాహటి హైకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ రూమి ఫుకాన్ నేతృత్వం వహించారు. ముస్లిం మహిళల మేలు కోరే ఈ చట్టం చేసేందుకు సిద్ధమవుతున్నామని ఇప్పటికే హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. మహిళలకూ సమాన హక్కులు కల్పించాలన్నదే UCC ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. పురుషులతో సమానంగా పోటీ పడేందుకు ఇది తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.
ఏంటీ చట్టం..?
భారత్‌లో ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉండటం చట్టరీత్యా నేరం. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఇందుకు సమ్మతి లభించదు. అటు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారమూ...ఇది నేరంగానే పరిగణిస్తారు. ఒకసారి పెళ్లైన పురుషుడు ఆమెని కాదని మరో మహిళను పెళ్లి చేసుకోవడం కుదరదు. బౌద్ధులు, జైనులు, సిక్కులు కూడా హిందూ వివాహ చట్టం పరిధిలోకే వస్తారు. Indian Penal Codeలోని సెక్షన్ 494,సెక్షన్ 495 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. అయితే...ముస్లిం చట్టంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇస్లాం మతానికి చెందిన పురుషులు నలుగురు మహిళలను పెళ్లి చేసుకునేందుకు సమ్మతి ఉంటుంది. కాకపోతే...వాళ్లందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి అసోం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో అసోంలోని ముస్లిం వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే కేంద్రం యునిఫామ్ సివిల్ కోడ్‌ని తీసుకొస్తామని ప్రకటించడంపైనే దుమారం రేగుతోంది. ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌ని నిర్వీర్యం చేసేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని కొన్ని ముస్లిం సంఘాలు మండి పడుతున్నాయి.
Also Read: వీడియో కాన్ఫరెన్స్‌లో పెళ్లి చేసుకున్న జంట, హిమాచల్ ప్రదేశ్ వరదల ఎఫెక్ట్