Himachal Pradesh Floods:


ఆన్‌లైన్ వెడ్డింగ్..


హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లను వరదలు ముంచెత్తుతున్నాయి. అన్ని పనులకూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక పెళ్లి చేసుకోవాలనుకున్న జంటలకూ తిప్పలు తప్పడం లేదు. వరదల కారణంగా అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. అందుకే ఓ జంట ఆన్‌లైన్‌లోనే వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంది. షిమ్లాకి చెందిన ఆశిష్ సింగా, కులూకి చెందిన శివాని థాకూర్‌ పెళ్లికి ముహూర్తం పెట్టినా వరదల వల్ల కలుసుకోలేకపోయారు. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. అదే ముహూర్తానికి పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుపట్టి మరీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ తంతు పూర్తి చేశారు. వీళ్లిద్దరికీ ఈ రెండ్రోజుల క్రితమే పెళ్లి కావాల్సి ఉంది. కానీ...వధువు ఇంటికి వెళ్లే దారి లేక ఆన్‌లైన్‌లోనే ఒక్కటయ్యారు. ఈ ఆన్‌లైన్ వెడ్డింగ్‌లో ఓ మాజీ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రజలెవరూ ప్రయాణాలు చేయొద్దని చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది హిమాచల్ ప్రభుత్వం. కులూ జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడి నుంచి ఎవరూ కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. వరద నీరు చుట్టుముట్టింది. ఇక వందలాది మంది టూరిస్ట్‌లు వరదల్లో చిక్కుకున్నారు. వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 


ఢిల్లీలోనూ భారీ వరదలు..


ఢిల్లీలోనూ వరద ఉద్ధృతి పెరుగుతోంది. 1978లో కురిసిన వర్షాలకు యమునా నది నీటి మట్టం 204.79 మీటర్లకు చేరుకుంది. ఇప్పుడా రికార్డు బద్దలైపోయింది. అప్రమత్తమైన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు పోటెత్తి ఇళ్లలోకి రాకుండా కొన్ని చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తున్న ఢిల్లీ ప్రజలు 45 ఏళ్ల క్రితం ముంచెత్తిన వరదల్ని గుర్తు చేసుకుంటున్నారు.  45 ఏళ్ల క్రితం ఢిల్లీలో యమునా నది పోటెత్తింది. వరదల ధాటిని తట్టుకోలేక యమునా నదిలోకి 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఒక్కసారిగా నీటి మట్టం 204 మీటర్లకు పెరిగింది. ఆ తరవాత బీభత్సం సృష్టించింది. 2013లోనూ యమునా నది ఇదే విధంగా ఉప్పొంగింది. అయితే...అప్పటికే వరద నీటిని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టడం వల్ల చాలా వరకూ ప్రభావాన్ని తగ్గించగలిగారు. కొన్నేళ్లుగా ఈ వరదల ధాటి పెరుగుతూ వస్తోంది. లక్షలాది మందిపై ప్రభావం పడుతోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. నోయిడా కూడా వరదల ధాటికి అల్లాడిపోతోంది. ఇప్పటికే సహాయక శిబిరాలు ఏర్పాటయ్యాయి. చాలా చోట్ల తాగునీటికి ఇబ్బందిగా ఉంది. గ్రామాలకు వెళ్లేందుకు దారులులేకుండా పోయాయి. కొన్ని చోట్ల సరుకులు నిండుకుంటున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇక కలరా లాంటి వ్యాధులూ సోకే ప్రమాదముంది. కేజ్రీవాల్ ప్రభుత్వం మరో నాలుగు రోజుల పాటు స్కూళ్లు బంద్‌ చేయనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచించింది. 


Also Read: Intelligent women: ఇంటెలిజెంట్ విమెన్-టూత్ పేస్ట్ కవర్‌ను ఇలా కూడా వాడొచ్చని చూపించారు!