North India Floods: 


రికార్డు స్థాయి నీటిమట్టం..


దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 45 ఏళ్ల రికార్డుని చెరిపేస్తూ...207 మీటర్లకుపైగా నీటిమట్టం నమోదైంది. అక్కడితో ఆగకుండా మరింత పెరుగుతోంది వరద ఉద్ధృతి. ఇవాళ ఉదయం 8 గంటల (జులై 13) సమయానికి 208.48 మీటర్లకు పెరిగింది. వర్షాలు కురవడంతో పాటు హరియాణాలోని హత్ని కుండ్ బ్యారేజ్ (Hathni Kund Barrage)గేట్లు ఎత్తివేయడం వల్ల వరదల ధాటి పెరిగింది. ప్రస్తుత పరిస్థితులకు ఇదే కారణమని ప్రాథమికంగా భావించారు. అయితే..నిపుణులు మాత్రం ఢిల్లీ మునిగిపోవడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)కి చెందిన ఓ అధికారి కీలక విషయాలు వెల్లడించారు. 






"హత్నికుండ్ బ్యారేజ్ నుంచి విడుదలై నీరు చాలా వేగంగా ఢిల్లీకి చేరుకున్నాయి. గతంలో ఇందుకు కొంత సమయం పట్టేది. ఢిల్లీ ఇలా మునిగిపోవడానికి ప్రధాన కారణం..అక్రమ నిర్మాణాలు. గతంలో ఎంత వరద నీరు వచ్చినా ప్రవహించేందుకు స్పేస్ ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. వరద నీరు ప్రవహించేందుకు దారి లేకుండా పోయింది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో అనూహ్య స్థాయిలో వర్షాలు కురవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బ్యారేజ్ గేట్‌లు ఎత్తేయాల్సి వచ్చింది. తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదవడమూ ఈ పరిస్థితులకు దారి తీసింది. "


- అధికారులు, CWC


మూడు రోజుల్లోనే మునక..


సాధారణంగా ఈ స్థాయిలో వరదలు రావాలంటే కనీసం వారం రోజుల పాటు వర్షాలు పడాలి. కానీ...ఇక్కడ మూడు రోజుల్లోనే అధిక వర్షపాతం నమోదవడం వల్ల వరదలకు సిద్ధమయ్యే లోపే చుట్టుముట్టేశాయి. నదీతీర ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురి కావడమూ సమస్యగా మారింది. వరదల ధాటికి 20కి పైగా వంతెనలు కొట్టుకుపోయాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అన్ని సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం సాయం కూడా కోరారు.