Delhi Yamuna Flood: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా ఢిల్లీ నీట మునిగింది. పెద్ద ఎత్తున వరదలు ముంచెంత్తాయి. ఈక్రమంలోనే యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తుకు చేరుకుంది. దీంతో లోతట్టు  ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.


బుధవారం రోజు అర్ధరాత్రి సమయంలో నీటి మట్టం విపరీతంగా పెరగడంతో వరద నీరు ఇళ్లు, రోడ్లపైకి చేరింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం వెంటనే అత్యవసర చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్ వరదలతో నిండిపోయింది . అలాగే మజ్ను కా తిలాను కాశ్మీరీ గేట్ ఐఎస్బీటీతో కలిపే మార్గాన్ని మూసివేశారు. ఈ ప్రదేశం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. ఈక్రమంలోనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన 12 బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.


208.46 అడుగులకు చేరుకున్న నీటిమట్టం


హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నీటిని నదిలోకి విడుదల చేయడంతో ఉదయం 7 గంటలకు యమునాలో నీటిమట్టం 208.46 మీటర్లకు పెరిగింది. ప్రస్తుత నీటిమట్టం ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం జోక్యం చేసుకుని బ్యారేజీ నుంచి నీటిని విడుదలను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరింది. అయితే బ్యారేజీ నుంచి అదనపు నీటిని విడుదల చేయాలని కేంద్రం సమాధానం ఇచ్చింది. హర్యానా బ్యారేజీ నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటి ప్రవాహం తగ్గుతుందని కేంద్ర జల సంఘం తెలిపింది. 


రుతుపవనాలు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించిన హిమాచల్ ప్రదేశ్‌లో ఉత్తరాన మరింత భారీ వర్షం కారణంగా బ్యారేజీ నిండిపోయింది. వరదల కారణంగా అత్యంత దెబ్బతిన్న ప్రాంతాల్లో ఢిల్లీ కూడా ఉంది. గత రెండు రోజులుగా దేశ రాజధానిలో భారీ వర్షాలు పడనప్పటికీ, హర్యానా నుంచి విడుదలవుతున్న వరద నీరు కారణంగా యమున నది ఉప్పొంగడంతో... సమీప ప్రాంతాల ప్రజలకు కష్టాలను తెచ్చి పెట్టింది. భారీ వరదల క్రమంలో అనేక మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. యమునా నది నీటి మట్టం ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ రుతుపవనాలు, దశాబ్దాలలో ఢిల్లీలో అత్యధిక వర్షపాతం నమోదైంది.


ప్రజలకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి


యమునా నదిలో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. అకస్మాత్తుగా నీటిమట్టం పెరిగి మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలంతా ఖాళీ చేయాలని కోరారు.


 యమునా నది నీటిమట్టం పెరగడంతో ఐటీవో సమీపంలో ఉన్న ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం జలమయమైంది. అదే సమయంలో ఉద్యోగులు కార్యాలయానికి రావాలంటే నీటిలోనే రావాల్సి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం నది కరకట్టలను బలోపేతం చేస్తోందని, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తోందని రెవెన్యూ మంత్రి అతిషి చెప్పారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది.