Haryana News: హరియాణాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఓ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలు ఉన్నప్పుడు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి బదులుగా ఇప్పుడు ఎందుకు వచ్చారని ఓ బాధితురాలు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కోపంలోనే చెంపై చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ గుల్హా ప్రాంతంలోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ మరింత ఆగ్రహానికి లోనై వెంటనే ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ చెంపపై కొట్టింది. తమ ప్రాంతంలోని చిన్న జలాశయం గట్టు తెగిపోవడంతో తమ ప్రాంతమంతా వరదపాలైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడున్న ఉన్న పార్టీ నేతలు, పోలీసులు మహిళను నిలువరించారు. ఎమ్మెల్యేను క్షేమంగా ఇంటికి చేర్చారు.
ఆవేదనతోనే కొట్టారు, చర్యలేమీ తీసుకోను
ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో వరద పరిస్థితి గురించి ప్రజలు తనతో గట్టిగా మాట్లాడారని చెప్పారు. ఎమ్మెల్యే తలుచుకుంటే చిన్న జలాశయం గట్టు తెగిపోయి ఉండేది కాదని ఓ మహిళ చెప్పినట్లు వివరించారు. ఇది ప్రకృతి వైపరీత్యమని, కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల ఈ విపత్తు సంభవించిందని మహిళకు నచ్చజెప్పానని అన్నారు. కానీ ఆ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై తనపై చేయి చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆవేదనతోనే ఆమెను తనను కొట్టిందని.. ఈ విషయం గురించి తానేమీ పట్టించుకోవట్లేదని అన్నారు. ఆమెపై చట్టపరమైన చర్యలేవీ తీసుకోబోనని స్పష్టం చేశారు.
జలమయమైన హరియాణా హోంమంత్రి ఇళ్లు
హరియాణా గత కొంత కాలంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటిమయం అయ్యాయి. ఈక్రమంలోనే అంబాలాలోని హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ నివాసం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఇంటి పరిసరాలన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటు సిబ్బందికి కూడా ఇంట్లోకి వెళ్లేందుకు కష్టం అవుతోంది. మోకాళ్ల లోతు నీటిలోనే ప్రయాణం సాగిస్తున్నారు. రెసిడెన్షియల్ కాలనీలో ఒక వ్యక్తి విద్యుదాధాతానికి గురయ్యాడు. మరో ఘటనలో అంబాలా నగరంలో మూడు మృతదేహాలు నీటిలో తేలాయి.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏరరియల్ సర్వే నిర్వహించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం హరియాణా పొరుగున్న పంజాబ్ లో వర్షాలకు సంబంధించిన పలు సంఘటనల్లో దాదాపు 15 మంది మరణించారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ త్వరలోనే అంబాలాను సందర్శించినున్నట్లు అధికారులు చెబుతున్నారు.