భారత్- చైనా సైనిక కమాండర్ల మధ్య 15వ విడత చర్చలు జరగనున్నాయి. ఈ నెల 11న చర్చలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మిగిలిన ఘర్షణ ప్రదేశాల వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.  


ఎక్కడ?


15వ విడత కార్ప్స్ కమాండర్ లెవెల్ చర్చలు మార్చి 11న భారత్ వైపు ఉన్న చూషుల్-మోల్డో మీటింగ్ పాయింట్ వద్ద జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపు 50,000 నుంచి 60,000 మంది చొప్పున ఇరు దేశాల సైనికులు లద్దాఖ్‌లో గస్తీ కాస్తున్నారు.


సరిహద్దు సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు 14 దఫాలుగా చర్చలు జరిగాయి. పాంగాంగ్​ సరస్సు ఫ్రిక్షన్​ పాయింట్లు, గోగ్రా హైట్స్​ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయింది. హాట్​ స్ప్రింగ్స్​ వద్ద బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.


ఇదే సమస్య


తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌పై 2020 మేలో చైనా సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గతేడాది జూన్‌ 15న గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. చైనా వైపు సైతం మృతుల సంఖ్య భారీగా ఉందని అంచనా. ఈ పరిణామాలతో భారత్‌-చైనా యుద్ధం అంచు వరకు వెళ్లాయి. సరిహద్దు వెంబడి ఇరు దేశాలు బలగాలను పెద్దఎత్తున మోహరించాయి. ఈ తరుణంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండువైపులా అధికారులు రంగంలోకి దిగారు.


అయితే గల్వాన్ ఘర్షణపై తాజాగా షాకింగ్ విషయాలు బయటపెట్టింది ఆస్ట్రేలియాకు చెందిన ఓ పత్రిక. ఆ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికుల సంఖ్య డ్రాగన్ ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువని తేల్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ న్యూస్ పేపర్ క్లాక్సన్ ఈ నివేదికను ప్రచురించింది.


14 సార్లు



అయితే ఇప్పటివరకు 14 సార్లు ఇరు దేశాల సైనికి కమాండర్ల మధ్య చర్చలు జరిగాయి. కానీ ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాలేదు. మరి ఈ 15వ విడత చర్చిలైనా ఫలిస్తాయో లేదో చూడాలి.