ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త బాస్‌గా ఎయిర్  మార్షల్ వీఆర్ చౌదరిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత వైమానిక దళం ఉపాధ్యక్షుడుగా ఉన్న చౌదరిని భారత వాయుసేన కొత్త చీఫ్‌గా నియమించనున్నట్లు రక్షణ శాఖ మంగళవారం నాడు వెల్లడించింది. ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన అనంతరం భారత వాయుసేన కొత్త చీఫ్‌గా వీఆర్ చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. సరిగ్గా రెండేళ్ల కిందట సెప్టెంబర్ 30, 2019లో బాధ్యతలు చేపట్టిన భదౌరియా ఈ నెల చివర్లో రిటైర్ కానున్నారు.


వీఆర్ చౌదరి పూర్తి పేరు వివేక్ రామ్ చౌదరి. డిసెంబర్ 29, 1982లో ఎయిర్ ఫోర్స్ యుద్ధ విభాగంలో చేరారు. ఎయిర్ ఫోర్స్ లో ఆయన విశేష సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత వాయుసేనలో చీఫ్ పదవితో చౌదరి బాధ్యతల్ని మరింత పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఫైటర్ మరియు ట్రైనర్ ఎయిర్‌ క్రాఫ్ట్ లను దాదాపు 3800 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆయన సొంతం.


Also Read: BJP Vice President: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా బేబీ రాణి మౌర్య, దిలీప్ ఘోష్‌లు నియామకం..






వీఆర్ చౌదరి ఈ ఏడాది జూలై 1న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు భారత వాయుసేన యొక్క పశ్చిమ విభాగం ఎయిర్ కమాండ్ (డబ్ల్యూఏసీ) కమాండర్ ఇన్ చీఫ్‌గా సేవలు అందించారు. భారత్‌కు ఎంతో కీలకమైన లఢాఖ్ లాంటి ఏరియాలో, ఉత్తర భారతదేశంలోని ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించడంతో వీఆర్ చౌదరికి భారత వాయుసేన చీఫ్ మార్షల్‌గా నియమించినట్లు తెలుస్తోంది.


Also Read: మోదీ-బైడెన్ భేటీకి ముహూర్తం ఫిక్స్, క్వాడ్ దేశాల భేటీ కూడా.. వైట్ హౌస్ ప్రకటన


వీఆర్ చౌదరి విశిష్ట సేవలకుగానూ పరమ్ విశిష్ట్ సేవా మేడల్, ఏటీఐ విశిష్ట్ సేవా మెడల్, ద వాయుసేన మెడల్ అందుకున్నారు. త్వరలో భారత వాయుసేన చీఫ్ మార్షల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి