భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ స్థాయిలో మార్పులు చేపట్టింది. రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో మార్పులు అవసరమని భావించిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరు నేతలకు ప్రమోషన్ ఇచ్చారు. బేబీ రాణి మౌర్య, దిలీప్ ఘోష్‌లను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. బేబీ రాణి మౌర్య ఇటీవల ఉత్తరాఖండ్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు పంపారు. ఆ సమయంలో ఆమె రాజీనామా వెనుక కారణాలేంటని రాజకీయాంశంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఆమెను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించడంతో పార్టీ నేతలకు సైతం క్లారిటీ వచ్చింది.
దిలీప్ ఘోష్ పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. బలూర్ ఘట్ నుంచి ఎంపీగా లోక్‌సభలో ప్రాతినిథ్యం వహించిన ఘోష్‌కు సైతం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. బెంగాల్ లో పార్టీ పట్టుకోసం ప్రయత్నిస్తున్న క్రమంలో దిలీష్ ఘోష్‌కు బీజేపీ అధిష్టానం ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉత్తరాఖండ్ గవర్నర్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన బేబీ రాణి మౌర్య ఆగ్రా మేయర్‌గా ఎన్నికైన తొలి దళిత మహిళగా నిలిచారు. ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ వ్యూహకర్తగా ఆమెకు బీజేపీ బాధ్యతలు అప్పగించింది.
దిలీప్ ఘోష్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లగా.. పశ్చిమ బెంగాల్ బీజేపీలో మార్పులు చోటుచేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు మజుందార్‌కు అప్పగించారు. బెంగాల్‌లో పార్టీ అధ్యక్షుడిగా మజుందార్‌ను నియమించారు. ముకుల్ రాయ్ బీజేపీని వీడి టీఎంసీలో చేరగా.. అదే స్థానంలో దిలీప్ ఘోష్ నియమితులయ్యారు. మజుందార్‌ది ఆరెస్సెస్ భావజాలం కాగా, పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి.
Also Read: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై శుభవార్త.. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు భేష్.. ఫైజర్ ప్రకటన