కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నారులకు కొవిడ్19 వ్యాక్సిన్‌పై మరో శుభవార్త వచ్చింది. ప్రపంచంలో అధికంగా 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని దేశాల్లో 12 ఏళ్లు పైబడిన వారికి సైతం కరోనా టీకాలు ఇస్తున్నారు. తాజాగా చిన్నారులకు టీకాలపై మరో అడుగు ముందు పడింది. కొవిడ్ వ్యాక్సిన్ 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులపై మెరుగ్గా పనిచేస్తుంది. ఈ విషయాన్ని ఫైజర్ మరియు బయో‌ఎన్‌టెక్ సోమవారం సంయుక్తంగా ప్రకటించాయి. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు గమనిస్తే.. చిన్నారులపై వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తించినట్లు తెలిపారు.


అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ జర్మనీకి చెందిన భాగస్వామితో కలిసి కొవిడ్ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తోంది. వారు తయారు చేసిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులపై సత్ఫలితాలు ఇస్తున్నట్లు తేలింది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా చిన్నారులలో పరీక్షించగా యాంటీబాడీలు తక్కువ సమయంలో ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. ఈ ఫలితాలతో త్వరలోనే ఈ వయసు చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతులు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను యూరోపియన్ యూనియన్‌కు, అమెరికా ప్రభుత్వానికి సైతం అందించి అనుమతి తీసుకోవడానికి ఆ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వారి నివేదిక ఎంత త్వరగా సమర్పిస్తే అంత తక్కువ సమయంలో ఆ వయసు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అనుమతులు లభిస్తాయి.


Also Read: New Study: ఏ వయసులో ప్రోటీన్ షేక్స్ తీసుకుంటే మేలు? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?


‘కొవిడ్19 వ్యాక్సిన్ అందించడం ద్వారా చిన్నారులను కరోనా బారి నుంచి రక్షించాలని ఆత్రుతగా ఉన్నాం. త్వరలోనే ఫైజర్ వ్యాక్సిన్‌కు రెగ్యూలేటరి అనుమతి లభిస్తుందని’ ఫైజర్ సీఈవో అల్బర్ట్ బోర్లా అన్నారు. బూస్టర్ డోస్ విషయంపై ఫైజర్ ప్రతిపాదన చేసింది. 16 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు వారికి ఈ టీకా మరో డోసు ఇవ్వాలని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు ప్రతిపాదన చేయగా ప్రతికూల ఫలితం వచ్చింది. గంటల తరబడి సుదీర్ఘంగా చర్చించిన ఎఫ్‌డీఏ అధికారులు ఈ నిర్ణయం సరికాదని అభిప్రాయపడ్డారు. అదనపు డోసు తీసుకుంటే ఎంతమేరకు సురక్షితం అనే దానిపై రిపోర్ట్ లేకుండా అనుమతులు సాధ్యం కానది స్పష్టం చేసింది.


Also Read: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు 


బూస్టర్ డోసును 65 ఏళ్లు పైబడిన వారికి, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఇవ్వాలని ఫైజర్ కంపెనీ, బయో‌ఎన్‌టెక్ యోచిస్తోంది. మరోవైపు అమెరికాలో కరోనా మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో అక్కడ 2 వేలకు పైగా కొవిడ్ మరణాలు నమోదవుతున్నాయి.