Air India Pilot: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా వరుసగా ప్రయాణికులకు షాక్ మీద షాక్ ఇస్తోంది. పైలట్ల నిర్వాకంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. తాజాగా ఓ పైలట్ విమానాన్ని ప్రయాణం మధ్యలోనే నా డ్యూటీ టైం అయిపోయిందంటూ వెళ్లిపోగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. తాజాగా వెలుగు చూసిన ఘటన ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. ఆటోను వదిలేసినట్లు విమానాన్ని జర్నీ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో ప్యాసెంజర్లు విమానాశ్రయంలోనే చిక్కుకున్నారు. 


లండన్ నుంచి బయలుదేరిన AI-112 ఎయిరిండియా విమానం ఆదివారం ఉదయం 4 గంటలకు దిల్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే దిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడి సిబ్బంది ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు. దాంతో 10 నిమిషాల పాటు అక్కడే గాల్లో చక్కర్లు కొట్టిన విమానాన్ని ఆ తర్వాత రాజస్థాన్ లోని జైపూర్ కు దారి మళ్లించారు. దీంతో విమానం జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరం ల్యాండ్ అయింది. సుమారు 2 గంటల తర్వాత విమానం తిరిగి దిల్లీ వెళ్లేందుకు దిల్లీ ఎయిర్ ట్రాఫక్ కంట్రోల్ నుంచి అనుమతి వచ్చింది. కానీ, పైలట్ మాత్రం తన డ్యూటీ టైం అయిపోయిందని చెప్పేసి విమానాన్ని నడపబోనని వెళ్లిపోయాడు. దీంతో దాదాపు 350 మంది ప్రయాణికులు జైపూర్ ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు. చాలా సేపటి వరకు ఎయిరిండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవీ చేయకపోవడంతో వేరే దారి లేక చాలా మంది ప్రయాణికులు రోడ్డు మార్గం ద్వారా దిల్లీకి చేరుకున్నారు. ఆ అవకాశం లేని వారు విమానాశ్రయంలోనే పడిగాపులు కాశారు. చివరకు ఎయిరిండియా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో కొన్ని గంటల తర్వాత విమానం తిరిగి దిల్లీకి చేరుకుంది. 






పైలట్ల నిర్వాకంపై సోషల్ మీడియాలో ఫైర్


ఎయిరిండియా నిర్వహణపై, పైలట్ల నిర్వాహకంపై ఆగ్రహానికి గురైన ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ పరిస్థితి తెలిపారు. ఓ ప్రయాణికుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు ట్యాగ్ చేస్తూ పరిస్థితిపై ట్వీట్ చేశాడు. తమకు సాయం చేయాలని, ఎయిరిండియా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ పై ఎయిరిండియా స్పందించింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొంది. 


Also Read: Monsoon in India: దేశంలో 80 శాతానికి పైగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, ఇక వానలే వానలు!


మరో ఎయిరిండియా విమానం ఆలస్యం, ఈసారి చెన్నైలో..


తాజాగా మరో ఘటన జరిగింది. చెన్నై నుంచి దిల్లీకి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యమైంది. దీంతో దాదాపు 150 మంది ప్రయాణికులు చెన్నై ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 10.05 గంటలకు చెన్నై నుంచి ఎయిరిండియా విమానం దిల్లీకి బయలు దేరాల్సి ఉంది. అయితే ఈ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విమానం ఆలస్యం అయిందన్న సమాచారం కూడా  ఎయిరిండియా ఇవ్వలేదని ప్రయాణికులు తెలిపారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial