Tomato Price Hike: ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం మార్కెట్ లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సాధారణంగా చాలా కూరల్లో టమాటాను వినియోగిస్తున్నారు. నిన్న మొన్నటివరకు ఎండల కారణంగా టమాటా దిగుబడి తక్కువగా ఉంది. జూన్ మొదటి వారంలో రూ.15 నుంచి రూ.20గా ఉన్న టామాటా ధరలు ప్రస్తుతం రూ.60కి చేరుకుంది. కొన్ని చోట్ల టమాటా కేజీ ధర రూ.80కి చేరి వంటింట్లో మరింత మంట పెడుతోంది.


ప్రస్తుతం రూ.80, త్వరలో రూ.100 దాటనున్న టమాటా రేట్లు 
ఆదివారం కోలార్ లోని హోల్‌సేల్ APMC మార్కెట్‌లో 15 కిలోల టమాటా రూ. 1,100 ధర పలికింది. హోల్ సేల్ ధర ఇంతలా ఉందంటే.. కేజీ చిల్లర ధర రూ.80కి చేరుకుంది. రిటైల్ మార్కెట్‌లో కొన్ని చోట్ల నాణ్యత లేని టమాటాను సైతం ఇదే ధరలకు విక్రయిస్తున్నారు. ఈ బిజినెస్ కు సంబంధం ఉన్న ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. త్వరలోనే 1 కేజీ టమాటా ధర రూ.100 మార్కు దాటుతుందని అంచనా వేశారు. డిమాండ్ కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో కూరగాయల మార్కెట్ లో టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో మొన్నటివరకు వేడితో ప్రతికూల వాతావరణంలో ఉత్పత్తి తగ్గినట్లుగా తెలుస్తోంది.


టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు సైతం సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు మాత్రం సాధారణ ధరకు విక్రయిస్తున్నారు. బీన్స్ ఒక కేజీ ధర రూ.120 నుంచి రూ.140 గా ఉంది, చిక్కుడు ధర రూ. 90 పలుకుతోంది. క్యాప్సికం సైతం రూ.80 కాగా, పచ్చి మిరపకాయల ధరలు సైతం భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది బీన్స్‌ కు అధిక ధర రావడంతో ఈసారి కోలారులో రైతులు బీన్స్‌ సాగు చేశారు. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోవడంతో టమాటా లాంటి కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.


ఓవైపు మహారాష్ట్రలో పంట నష్టం జరిగింది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేయడంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాది సాధారణం కంటే 30 శాతం పంట దిగుబడి తక్కువగా ఉందని కోలార్ కు చెందిన రైతులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే టమాటా ధరలు చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఒకేసారి భారీగా టమాటా దిగుబడి రావడం, సాగు కూడా అధిక మొత్తంలో ఉండటంతో గతేడాది కేజీ టమాటా రూ.5కు పడిపోయింది.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలోని మార్కెట్ లో గత ఏడాది టమోటా ధరలు భారీగా పతనమయ్యాయి. మదనపల్లె మార్కెట్‌ నుంచి టమాటాలు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయని తెలిసిందే. సాగు అధికం కావడం, దిగుబడి అదే స్థాయిలో రావడంతో గత ఏడాది టమాటా రైతులు కనీస ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేజీకి కేవలం రూ.5 మాత్రమే ధర రావడంతో రవాణా ఖర్చులు, పెట్టుబడి, కూలీ ఖర్చులు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial