Himachal Rains : హిమాచల్ ప్రదేశ్ మరోసారి బిక్కు బిక్కు మంటోంది. రుతుపవనాల ప్రభావం కారణంగా భారీ వర్షాలుపడుతూండటంతో.. వరదలు వస్తున్నాయి. మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో పర్యాటకులు, స్థానికులు సహా 200 మందికిపైగా ప్రజలు చిక్కుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రశార్ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయని.. దీంతో టూరిస్టులు వరదల్లో చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు.
మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతంలో గల ప్రశార్ సరస్సు సమీపంలో ఒక్క సారిగా వరదలు వచ్చి పడ్డాయి. ఈ వరదల్లో పర్యాటకులు, స్థానికులు సహా 200 మందికిపైగా ప్రజలు ప్రశార్ రోడ్డులోని బగ్గీ వంతెన సమీపంలో చిక్కుకుపోయారు. చంబా నుంచి వచ్చిన విద్యార్థుల బస్సు, పరాశర్ నుంచి తిరిగి వస్తున్న అనేక వాహనాలు వరదల్లో చిక్కుకుపోయాయి. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పండో-మండి జాతీయ రహదారిలో ఛార్మిలే నుంచి సత్మిలే మధ్య చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
వరదల కారణంగా జాతీయ రహదారిని మూరేశారు. ల ఆ రహదారిని తిరిగి ప్రారంభించేందుకు కొంత సమయం పడుతుంది. అక్కడ చిక్కుకున్న వారు ఇతర మార్గాల ద్వారా వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నరు. మరో వైపు జమ్మూకశ్మీర్ లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పెద్ద ఎత్తున పడుతున్న వర్షాల కారణంగా ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడుతూండటంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
రుతుపవనాల ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా తదితర రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.